కాంగ్రెస్ కు హ్యాండ్ ఇవ్వబోతున్న చిరంజీవి..!!?

Vasishta

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పునర్వైభవం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పార్టీ బరువు బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే.. ఆయనకు సహకరించేవారే కరువయ్యారు. ముఖ్యంగా తాము మాస్టర్ పీస్ గా చెప్పుకునే చిరంజీవి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.


          కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసినట్లేనా..? అంటే దాదాపు ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రం మొత్తం రఘువీరా పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల నేతలు ఆయనతో కలిసి కాస్తోకూస్తో పనిచేస్తున్నారు. ఏదో కార్యక్రమం చేపట్టి ముందుకెళ్తున్నారు. ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పోటీ చేసి గట్టిగానే ప్రచారం చేశారు. అయితే వారికి కాలం కలసిరాకపోవడం వేరే సంగతి.


          రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కంచుకోట లాంటి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి తప్పు చేశామనే భావన కాంగ్రెస్ పెద్దల్లో కనిపిస్తోంది. అయిందేదో అయిపోయింది.. ఇక గట్టిగా ట్రై చేస్తే  మళ్లీ గాడిలో పడతామని భావిస్తున్న ఆ పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నా.. చిరంజీవి మాత్రం అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఆయన వెళ్లి ఓటేసి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాలుమోపడం లేదు. హైదరాబాద్ ను వదిలి వెళ్లడం లేదు.


          చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అంతకుముందు ఖైదీ నెంబర్ 150 సినిమాతో కాలం గడిపేశారు. తాను, తన సినిమాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు తప్ప తానొక పార్టీలో ఉన్నానని, ఆ పార్టీకోసం పని చేయాలనే ధ్యాస చిరంజీవిలో ఏ మాత్రం కనిపించడం లేదు. పార్టీ కేంద్ర పరిశీలకులు వచ్చి పెడ్తున్న మీటింగ్ లకు కూడా చిరంజీవి గైర్హాజరు కావడం వారిని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా అమరావతిలో జరిగిన సమావేశానికి కూడా మెగాస్టార్ హ్యాండిచ్చారు. అంతకుముందు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో కూడా ఆయన పాల్గొనలేదు. చిరంజీవి వ్యవహార శైలి చూస్తుంటే చిరంజీవి ఇక పార్టీకి గుడ్ బై చెప్పినట్టేనని కాంగ్రెస్ పార్టీ ఓ అంచనాకు వచ్చేసింది.


          వచ్చే ఏడాది మార్చి వరకూ చిరంజీవికి పదవీకాలం ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆయనకు రాజ్యసభ సీటు దక్కే పరిస్థితి లేదు. దీంతో చిరంజీవి కూడా ఆశలు వదిలేసుకున్నారు. తన పనేదో తాను చేసుకుంటే బాగుంటుందనే అంచానకు వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే సినిమాల్లో బిజీ అయిపోయారు. మార్చి తర్వాత ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఏ పార్టీలో చేరే ఉద్దేశం కూడా ఆయనకు లేదనేది ఆయన సన్నిహితులు చెప్తున్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: