నంద్యాల బైపోల్ : విజయం వరించేదెవరిని..?

Vasishta

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రచారపర్వం ముగియడంతో నేతల హడావుడి తగ్గిపోయి పట్టణం ఒక్కసారిగా బోసిపోయింది. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఓటర్ల ప్రలోభాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఏదేమైనా టిడిపి, వైసిపిలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో విజయలక్ష్మి ఎవరి తలుపు తడుతుందనేని ఆసక్తికరంగా మారింది.


నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడడంతో పార్టీలు ప్రలోభాలపర్వానికి తెరతీశాయి. పోలింగ్‌కు ఇక గంటలే మిగిలి ఉండడంతో వీలైనంత ఎక్కువ మందిని కలిసేందుకు వ్యక్తిగతంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. చెవిదిద్దులు, ముక్కుపుడకలు లాంటివి మహిళలకు పంచుతూ మరోవైపు ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నాయకులు, ఏజెంట్లకు గాలం వేస్తున్నారు.


నందులకోట నంద్యాలలోని ఓటరు తీర్పునకు కొద్ది గంటలే మిగిలింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో జెండా ఎవరు ఎగరవేస్తారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇన్ని రోజులు గ్రామాలు, వార్డుల బాధ్యతలు చూసిన టిడిపి, వైసిపి నేతలు ఎవరికివారు గెలుపు ధీమాతో పట్టణం నుంచి నిష్క్రమించారు. నియోజకవర్గంలో నంద్యాల పట్టణం, గ్రామీణం, గోస్పాడు మండలాలున్నాయి. మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉండగా.. ఒక్క పట్టణంలోనే 1,42,628 మంది ఉన్నారు. గ్రామీణంలో 47,386 మంది, గోస్పాడు మండలంలో 28,844 మంది ఓటర్లు ఉన్నారు. నంద్యాల పట్టణమే కీలకమైనందున రెండు పార్టీలు తమ దృష్టిని ఎక్కువగా ఇక్కడే కేంద్రీకరించాయి.


నియోజకవర్గంలో అధిక శాతం ఓటర్లుగా ఉన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ, టీడీపీలు ముమ్మర ప్రచారం చేశాయి. ఒకవైపు రోడ్డుషోలు, కూడలిల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూనే ఆయా వర్గాల ప్రముఖులతో ప్రత్యేక మంతనాలు సాగించాయి. నియోజకవర్గంలో అధికంగా ఉన్న ముస్లింలు, కాపు, బలిజ ఓట్లే కీలకంగా భావించిన నేతలు తదనుగుణంగా పావులు కదిపారు. వార్డు స్థాయి నేత నుంచి పట్టణ స్థాయి వరకు అందరినీ కలుపుకొని ప్రచారం చేశారు. అధికార, ప్రతిపక్షాల హామీలు, పరస్పర విమర్శలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో తేలాల్సి ఉంది. 1983 నుంచి ఇప్పటివరకు ఎనిమిది పర్యాయాలు నంద్యాల శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే ఇందులో నాలుగుసార్లు టిడిపి గెలిచింది.


సాధారణంగా బైపోల్స్ అంటే అధికారపక్షమే విజయం సాధిస్తుంటుంది .. అయితే ఈసారి ప్రతిపక్ష నేత జగన్ మునుపెన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో 15 రోజలు మకాం వేసి మరీ ప్రచారం నిర్వహించారు. దాంతో టిడిపి కూడా జాగ్రత్త పడి ముమ్మర ప్రచారం చేసింది. అధికారంలో ఉండటం, చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందన్న ధీమా టిడిపిలో కనిపిస్తోంది. అదలా ఉంటే జగన్ ప్రచారసభల్లో ముఖ్యమంత్రిని చంపాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అదే తమకు మైనస్ అవుతుందేమో అన్న గుబులు వైసిపి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో అన్నది తేలాలంటే మరో వారం ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: