ఆళ్లగడ్డ టీడీపీలో ఆధిపత్యపోరు.! చంద్రబాబుకు తలనొప్పులు..!!

Vasishta

నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ఊహించని విధంగా టీడీపీలో చేరడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ప్రతాప్‌రెడ్డి టీడీపీలో చేరడం ఉప ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  


మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగిన గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి మరింత బలం చేకూరినట్లైంది. భూమాకు ప్రత్యర్థులుగా నిలిచిన గంగుల కుటుంబీకుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి... 2004లో కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ సమయంలో టీడీపీలో ఉన్న భూమా వర్గంలో చేరి రాజకీయ సంచలనం సృష్టించారు.  


మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆళ్లగడ్డ నుంచే ప్రారంభమైంది. ఈయన తండ్రి గంగుల తిమ్మారెడ్డి ఆళ్లగడ్డ అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తిమ్మారెడ్డి మరణించడంతో ఆయన రాజకీయ వారసుడిగా గంగుల ప్రతాప్‌రెడ్డి 1980లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. దివంగత ప్రధాని పీవీ నరసింహరావు పోటీ చేసేందుకు వీలుగా నంద్యాల పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి పీవీకి అవకాశం కల్పించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహరావు గంగులకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చారు.  


ఫ్యాక్షన్‌ రాజకీయాల పుట్టినిల్లుగా పేరుగాంచిన ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో భూమా, గంగుల కుటుంబాల మధ్యే ఘర్షణలు నడిచాయి. 2014 ఎన్నికలకు ముందు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల వల్ల గంగుల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరారు. అప్పటికి వైసీపీ నేతలుగా భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి ఉన్నారు. శోభానాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఎన్నికలో పోటీ చేయాలని గంగుల ప్రభాకర్‌రెడ్డి భావించినప్పటికీ అధినాయకత్వం గత సాంప్రదాయం ప్రకారం పోటీకి నిలపలేదు.


రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరడంతో... టీడీపీలో కొనసాగలేని గంగుల వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలో చేరిన వారం రోజులకే ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. ఆ తర్వాత గంగుల ప్రతాప్‌రెడ్డి కూడా వైసీపీ అధినేత జగన్‌తో ఇటీవల సమావేశమయ్యారు. ఆయన కూడ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ,అనుహ్యంగా టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో బలమైన అనుచరవర్గం ఉన్న గంగుల ప్రతాప్‌రెడ్డి కీలకమైన సమయంలో టీడీపీకి కలిసివచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న గోస్పాడు మండలంపై గంగులకు మంచిపట్టు ఉంది. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీడీపీలో చక్రం తిప్పే నేత ప్రస్తుతం లేరు. భూమా నాగిరెడ్డి బతికి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ సమయంలో గంగుల ప్రతాప్‌రెడ్డి టీడీపీలో చేరడం కలిసివస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.


అయితే భూమా అఖిలప్రియకు, గంగుల ప్రతాపరెడ్డికి మధ్య సఖ్యత చేకూరే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయాల్లో యువకులైన అఖిలప్రియ ఎలా నెగ్గుకొస్తుందనేది ఆసక్తికరమే. అదే సమయంలో రాజకీయాల్లో తలపండిన నేత గంగుల ప్రతాపరెడ్డి. మరి వీరిద్దరినీ చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తారనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: