పవన్, బాబు భేటీ – దేనికి సంకేతం?

Vasishta

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. విభజనతో తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న నవ్యాంధ్రను గట్టెక్కించాలంటే అది చంద్రబాబుకే సాధ్యమని నమ్మి నాడు టీడీపీకి మద్దతిచ్చారు పవన్ కల్యాణ్. ఆ మాటను ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ ను తరిమి తరిమి కొట్టాలంటూ బీజేపీ పక్షాన నిలిచారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చి ఆ తర్వాత హ్యాండిచ్చిన బీజేపీపై ఇప్పడు పవన్ కల్యాణ్ మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం సీరియస్ గా దృష్టి పెట్టడం లేదంటూ అటు టీడీపీపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.


పవన్ కల్యాణ్ బీజేపీపై యుద్ధం ప్రకటించారన్నది సుస్పష్టం. అయితే ఆ స్థాయి తీవ్రత తెలుగుదేశం పార్టీపై మాత్రం చూపించడం లేదు. ఇందుకు ఆయన చెబుతున్న కారణం మరోలా ఉంది. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎన్నో కష్టాలకోర్చి చంద్రబాబు అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తున్నందున ఆయనకు అందరం మద్దతివ్వాలనేది పవన్ అభిలాష. అయితే చంద్రబాబులాగా మిగిలిన నేతలు కష్టపడడం లేదనేది ఆయన ఆరోపణ. చంద్రబాబుపై పవన్ కు ఎప్పుడూ సాఫ్ట్ కార్నర్ ఉందని అర్థమవుతోంది.


మొన్నటివరకూ బీజేపీ, టీడీపీ అనుకూల నేతగానే పవన్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎన్నికల గోదాలోకి దిగబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీతో ఎలా వ్యవహరిస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జనసేనతో దోస్తీకి వైసీపీ తహతహలాడుతోంది. జనసేనతో కలసి వెళ్లకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడం అసాధ్యమని ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే జగన్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. మరి దీనిపై పవన్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.


జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేకుంటే ఏదైనా పార్టీతో కలిసి పోటీ చేస్తుందా అనే ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ భేటీ అవుతున్నారనే సమాచారం ఆసక్తికి తెరలేపింది. ఉద్దానం కిడ్నీ సమస్యపై చర్చించేందుకే ఈ భేటీ జరుగుతోందనే సమాచారం ఉన్నా.. రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాకుండా ఉంటాయని భావించలేం. ఒకవేళ అలాంటి చర్చలేవైనా జరిగితే అవి ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరమే.


పవన్ కల్యాణ్ వైసీపీతో కలిసి పోటీ చేస్తే టీడీపీకి ఇబ్బందులు తప్పవు. అలా కాకుండా ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం టీడీపీ సేఫ్. జనసేనతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ-బీజేపీ కూటమి సిద్ధంగా ఉండచ్చు. కానీ సీట్ల సర్దుబాటు అంత ఈజీ కాదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో పొత్తులపై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేం. అయితే వైసీపీ మాత్రం ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించింది. జనసేనతో దోస్తీకి శతధా ప్రయత్నిస్తోంది. మరి ఈ పొత్తుల వ్యవహారం ఎలా ఉంటుంది. ఎవరికి లాభిస్తుంది తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ ఏదైనా ఊహాగానమే..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: