పాక్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ - ఇంటా బయటా సర్వత్రా హర్షం

అర్ధరాత్రి వేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అడుగుపెట్టిన భారత బలగాలు ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి 38 మంది ఉగ్రవాదులను హతం చేశాయి. కనీసం 7 ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశాయి. నియంత్రణ రేఖను ఆనుకుని మూడు కిలోమీటర్ల లోపలి దాకా జొచ్చుకెళ్లిన భారత కమెండోలు వీర విహారం చేశారు. పక్కా టార్గెట్‌లపైనే విరుచుకుపడ్డారు. ఉగ్రవాద పీచమణిచారు. విజయవంతంగా శతృసంహారాన్ని పూర్తిగా చేశారు. యూరీ సెక్టార్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసిన ఉగ్రవాద మూకలపై గట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం బుధవారం రాత్రి 12.30 గంటలకు ఆకస్మిక దాడులు ప్రారంభించింది.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 3 కి.మీ. దూరం పాకిస్థాన్‌వైపు చొచ్చుకెళ్ళి దాడులు నిర్వహించింది. తెల్లవారు జాము 4.30 గంటల వరకు దాడులు జరిగాయి. రష్యన్ తయారీ ఎంఐ 17హెలికాప్టర్‌లో కెల్, లింపా, బిన్బర్ గుండా భారతీయ కమాండోలు వెళ్ళారు. గంటకు 250 కి.మీ.వేగంతో వెళ్ళినట్లు సమాచారం. రక్షణ మంత్రి మనోహర్పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బుధవారం రాత్రి పూర్తిగా ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోనే బస చేసి, పర్యవేక్షించారు. డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మాట్లాడుతూ దాడుల సమాచారాన్ని పాకిస్థాన్ డీజీఎంఓకు ముందుగానే తెలియ జేశామని, కావాలంటే రుజువులు చూపిస్తామని చెప్పారు. యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.


నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆకస్మిక దాడిని కాంగ్రెస్ సమర్థించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపినందుకు సైన్యాన్ని ప్రశంసిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 
ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా మాట్లాడుతూ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడిని కాంగ్రెస్ సమర్థిస్తోందన్నారు. సైన్యం ధైర్య సాహసాలకు గౌరవ వందనం చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. 


సహనం, సంయమనం పాటించే రోజులు పోయాయి. ఇప్పటికీ ఉగ్రవాదులకు సహకరించాలని పాకిస్థాన్ అనుకుంటే గట్టి మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితులు వచ్చాయి. బుధవారం రాత్రి భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడులతో ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పఠాన్‌కోట్, యూరీ దుర్ఘటనల అనంతరం భారత సైన్యం ఈ దాడులు చేయడంతో సైన్యం ఆత్మవిశ్వాసం బలపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.


పాకిస్థాన్ స్పందిస్తూ తమ సైనికులు ఇద్దరు మరణించారని ఆరోపించడంపై విమర్శలు వస్తున్నాయి. ఉగ్రవాద స్థావరాల వద్ద సైనికులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండిస్తుండటాన్నిబట్టి ఉగ్రవాదంపై దాడికి ఆయన ప్రభుత్వం వ్యతిరేకమని వెల్లడి కావడం లేదా అని నిలదీస్తున్నారు.


 
ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మాట్లాడుతూ భారత సైన్యం నిర్ణయం తీసుకుంటే, యావత్తు జాతి మద్దతిస్తుందన్నారు. జమ్మూ-కశ్మీరు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్ సింగ్ మాట్లాడుతూ పాకిస్థాన్ ఉగ్రవాద దేశంగా ప్రవర్తిస్తోందని, దానికి దీటైన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పారు. ఈ దాడుల వల్ల మన సైన్యం ఆత్మవిశ్వాసం బలపడిందన్నారు.


ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడిని ఉరి సైనిక స్థావరంలోని అమర వీరుల కుటుంబాలు ప్రశంసిస్తున్నాయి. యూరీ  సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిలో అమరుడైన హవల్దార్ అశోక్ కుమార్ సతీమణి సంగీత దేవి భారత సైన్యాన్ని ప్రశంసించారు. హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాద నేతలకు కూడా గట్టి గుణపాఠం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఐదేళ్ళ నుంచి మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడుల వెనుక హఫీజ్ సయీద్ హస్తం ఉందని, భారతీయ దళాలు ఇప్పుడు హఫీజ్‌పై దృష్టి సారించాలని, మన దేశంలో శాంతి నెలకొనడానికి హఫీజ్‌ను హతమార్చాలని ఆమె అన్నారు.


ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏం చేసినా న్యాయమేనని బెలూచిస్తాన్ మద్దతుదారులు అన్నారు. ఉగ్రవాదాన్ని ఏరి పారేసేందుకు భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మద్దతిస్తామని చెప్పారు. భారతదేశంలో పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడి అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది.


పాక్ భూభాగంలోనే తాము ఈ దాడులు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ నేరుగా ప్రకటించారు కూడా. యూరీ సెక్టర్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్ చేసిన ఈ దాడులను ఇప్పటికే అంతర్జాతయ సమాజం మద్దతిస్తున్న నేపథ్యంలో తాజాగా బెలూచిస్తాన్ మద్దతుదారులు భారత్ వైపు మరోసారి తమ గొంతు వినిపించారు.గురువారం మధ్యాహ్నం కొంతమంది బెలూచిస్తాన్ మద్దతుదారులు ?మజ్దాక్ దిల్సాద్ బాలోచ్" అనే నాయకుడి ఆధ్వర్యంలో పాక్ హైకమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ ఏం చేసినా సరైనదేనని, తాము ఇలాంటి దాడులకు మద్దతిస్తామని, ఇలాంటి దాడులు తమ ప్రాంతంలో కూడా భారత్ నిర్వహించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: