భారీ వర్షానికి స్తంభించిన జన జీవనం...!!

Shyam Rao
భాగ్యనగరిపై వరుణుడు తన ఆగ్రహాన్ని చూపాడు. ఈ ఉదయం దాదాపు గంటన్నరకు పైగా పడ్డ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా, అన్ని ప్రధాన రహదారులపై రెండు నుంచి మూడడుగుల నీరు చేరుకుంది. రోడ్లపై వందలాది వాహనాలు నీట మునిగి ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా, ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. పాతబస్తీలో గోడకూలి ఓ చిన్నారి మరణించగా, రామాంతపూర్, బోలక్ పూర్ ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఆరుగురు మరణించారు.



కార్యాలయాలకు, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఉదయం 9.30గంటలకు మియాపూర్‌లో బయల్దేరిన వారు మధ్యాహ్నం 2 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌ చేరుకోగలిగారు. వర్షం కారణంగా రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. రహదారిపై గుంతల కారణంగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ముందుకు కదలలేని పరిస్థితి. మార్గమధ్యలో ద్విచక్రవాహనాలు, కార్ల ఇంజిన్‌లోకి నీరు చేరడంతో పలు చోట్ల వాహనాలు మొండికేశాయి. దీంతో వాటి వెనుకవైపు వచ్చే వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పలుచోట్ల విపరీతమైన రద్దీ నెలకొంది.



నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5 నుంచి 9 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు గంట ఆలస్యంగా విధులకు హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వర్షం ప్రారంభమయ్యే సమయానికే విద్యార్థులతో బయలుదేరిన వివిధ పాఠశాలల బస్సులు ట్రాఫిక్ జాంలో చిక్కుకోగా, చిన్నారులు ఏడుపులు లంఘించుకున్న పరిస్థితి నెలకొంది. 



బంజారాహిల్స్, సోమాజిగూడ, బేగంపేట, మెహిదీపట్నం, టోలీచౌకీ, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్ పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు వరదగా మారి హుస్సేన్ సాగర్ లోకి ఒక్కసారిగా వచ్చి చేరడంతో నీటి మట్టం పెరిగింది. మరో రెండు అడుగుల నీరు చేరితే, గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీటిని వదలాల్సి వుంటుంది. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, రాజ్ భవన్ సమీపంలో రైలు పట్టాలపై భారీగా నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.



హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి పెరిగి ప్రమాదకర స్థితికి రాగా, కొద్దిసేపటి క్రితం గేట్లను ఎత్తివేసి నీటిని మూసీ నదిలోకి వదిలారు. గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సాగర్ తూములను స్వయంగా తెరిచారు. నురగలు కక్కుతూ కాలువ ద్వారా మూసీలోకి వెళుతున్న నీరు కనులకు విందు చేస్తుండగా, దాన్ని చూసేందుకు పెద్దఎత్తున నగర వాసులు వచ్చి చేరారు. జలాశయానికి వచ్చిన వరద నీటిని వచ్చినట్టు వదిలేస్తామని చెప్పిన అధికారులు, నీటి మట్టం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించామని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: