రోజా హాపీస్: రాజకీయ వ్యూహాలతో రెడ్ది సామాజిక వర్గాలను చల్లబరుస్తున్న వైఎస్ జగన్

ఏపీలో మంత్రిమండలిలో సీట్లు లభించక పోవటంతో ఆవేదనలో కూరుకుపోయిన రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలను బుజ్జ గించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మహిళల కోటాలో కేబినెట్ బెర్తు ఆశించిన నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజాకు ఏపీఐఐసీ ( ఏపీ పారిశ్రామిక, మౌలిక వసతుల అభివద్ధి సంస్ధ) ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించిన జగన్, మంగళగిరిలో నారా లోకేష్ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ ఛైర్మన్ పదవి ఆఫర్ చేశారు. 

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి విప్ పదవులు కేటాయించారు. మొన్నటి ఏపీ కేబినెట్ విస్తరణలో చోటు దక్కని రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు రెండ్రోజులుగా సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తోంది. భవిష్యత్తుపై భరోసా ఇస్తూనే ప్రస్తుతానికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. 

ఇప్పటికే జగన్తో భేటీ అయిన నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఇప్పటికే ప్రకటించిన రోజా, ఆ మేరకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాలు చెప్తున్నాయి.


రోజా, ఆర్కే తరహా లోనే మంత్రి పదవులు రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పిన్నెల్ని రామకృష్ణారెడ్డితో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయభాను, బోయ సామాజిక వర్గానికి చెందిన కాపు రామచంద్రారెడ్డికి సైతం విప్-లుగా నియమించారు. తద్వారా అసంతృప్తులను కాస్త బుజ్జగించి నట్లయింది. రాబోయే రోజుల్లో మరి కొందరు అసంతృప్తులను సైతం నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా బుజ్జగించాలని వైసీపీ భావిస్తోంది. ఏపీ అసెంబ్లీ తొలి సమా వేశాలు ముగిసిన తర్వాత పదవుల భర్తీ ఉంటుందని వైసీపీ సీనియర్ నేతలు ఇప్పటికే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: