వైసీపీ నేత గౌతమ్ రెడ్డి తెగింపు.. ఏపీ సీఎంకు ఎదురెళుతున్నాడా?

Reddy P Rajasekhar

నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసులన్నీ ఇటీవల ఒక్కొక్కటిగా తెరపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయనపై నమోదైన పలు ఫిర్యాదులలో, ఫిర్యాదుదారులు స్వయంగా వెనుకడుగు వేసి తమ పిటిషన్లను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య, గత ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పి.గౌతంరెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

గౌతంరెడ్డి ఫైబర్ నెట్ కేసులో కోర్టుకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తుది తీర్పు ఇచ్చే ముందు తన వాదనను తప్పనిసరిగా వినాలని ఆయన కోరారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందని, కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ గత ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో అప్పటి సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడును అరెస్టు కూడా చేశారు.

అయితే, ఈ కేసులో కీలకంగా ఉన్న ఫైబర్‌నెట్‌ కార్పోరేషన్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి ఇటీవల తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. సరిగ్గా ఈ సమయంలోనే, అధికారంలో ఉన్న పార్టీకి చెందిన మాజీ నేత అయిన గౌతంరెడ్డి, కేసు నుంచి చంద్రబాబు పేరును తొలగించే ముందు తన వాదనను వినాలని కోర్టును అభ్యర్థించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పాత కేసుల విషయంలో ముందుకు వెళ్లినా, ఫిర్యాదుదారులే వెనక్కి తగ్గడం జరుగుతుంటుంది. కానీ, గౌతమ్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం, అధికార పార్టీకి ఎదురెళ్లేలా కనిపించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: