రోజా డ్రామా VS గాలి వ్యాఖ్యలు: అసలు వీడియో ఎక్కడ..?

Amruth kumar
వైసీపీ నాయకురాలు రోజా తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తన, మీడియా ముందు ప్రదర్శన సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ఒక సమయంలో చలనచిత్ర నటిగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న రోజా, ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా అదే నటనా ప్రతిభను చూపుతున్నట్టు కనిపిస్తోంది. కానీ, అది నిజాయితీ కాదు, అనవసర నాటకం అన్న ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. రోజా సాక్షి టీవీలో చేసిన వ్యాఖ్యలు చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఏడుపులు, పెడబొబ్బలు - ఇవన్నీ ఎందుకు? అసలు గాలి భానుప్రకాష్‌ ఏం అన్నారని ఆమె ఇంతగా బాధపడుతున్నారు? అసలు విషయం ఏంటన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. జగన్‌ రెడ్డి సైతం, తాను చేసిన ట్వీట్‌లో పొడవుగా వివరించారు కానీ ఆ వ్యాఖ్యలకి ఆధారంగా వీడియోను చూపించలేదు. అదే విధంగా, వైసీపీ నేతలు, మీడియా సంస్థలు కూడా నిజంగా గాలి భానుప్రకాష్‌ ఏమన్నారో వీడియో రూపంలో చూపించకుండా విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు.

 

రోజా ఆరోపణల ప్రకారం - భానుప్రకాష్ ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని, రూ.2000కి అన్ని పనులు చేసేవారని అన్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఆ వీడియో ఇప్పటికే వైరల్ అయ్యేది. కానీ అందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో, నమ్మెలా క‌నిపాంచ‌టం లేదు. భానుప్రకాష్‌ చేసిన వ్యాఖ్యల్లో వ్యక్తిగత దూషణ లేదని, కేవలం ఒకప్పుడు రోజా కుటుంబ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించి, ఇప్పుడైతే కోట్ల సంపాదించారని విమర్శించారని అంటున్నారు. కానీ ఈ విమర్శలు రాజకీయ విమర్శల స్థాయిలోనే ఉన్నాయో తప్ప, వ్యక్తిత్వంపై దూషణలుగా కనిపించకపోవచ్చు. ఇప్పటికే ప్రజలు ఈ విధమైన రాజకీయ నాటకాల పట్ల ఆసక్తి కోల్పోయారు. ప్రతి విషయంలో తాము బాధితులమని నటిస్తూ, డ్రామాలుగా ప్రజల ముందుకు రావడం వైసీపీకి నష్టం చేస్తున్నదే తప్ప లాభం కాదు. రోజా గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆమె టోన్, బాడీ లాంగ్వేజ్‌ కారణంగా సానుభూతి కూడా రాలడం లేదు.

ఒకవైపు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలు అందరికీ కనిపించేలా ఉన్నాయి. వైసీపీ నేతలు కూడా ఆ విషయాన్ని అందంగా వినియోగించుకున్నారు. కానీ అదే పార్టీ.. గాలి భానుప్రకాష్ పై ఆరోపణలు చేస్తూ, అసలు వీడియో బయటపెట్టకపోవడం వెనుక దాగిన ఉద్దేశం ప్రజలకు తెలుస్తోంది. సారాంశంగా చెప్పాలంటే, ఆధారాల్లేని ఆరోపణలు – నాటకంగా మారిన రాజకీయ పథకం. రోజా ఏడుపులతో, మీడియా ముందున్న ఆవేదనతో కాకుండా, నిజాలను చూపించే ధైర్యం వైసీపీ నేతల్లో కనిపించాలి. లేకపోతే ఇది కూడా రాజకీయ డ్రామా పార్ట్-2గానే ప్రజలు తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: