ఫలించిన రామచంద్ర యాదవ్ పోరాటం... మామిడి మద్దతు ధర పెంచిన ప్రభుత్వం
- ఇలాంటి ప్రభుత్వం, ప్రతిపక్షం ఉండడం దౌర్భాగ్యం అంటూ ఆగ్రహం
- బీసీవై పార్టీ పోరాటంతో ఆఘమేఘాల మీద స్పందించిన ప్రభుత్వం
- కేజీ మామిడికి రు. 2 అదనంగా పెంచుతూ నిర్ణయం
- రామచంద్ర యాదవ్‌తో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్
రైతుల పక్షాన బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ చేసిన పోరాటానికి కూటమి ప్రభుత్వం కదిలివచ్చింది. మామడి పంటకు మద్దతు ధర పెంచుతూ తక్షణ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో బుధవారం మామిడి పంట కొనుగోలు చేసే కేంద్రాల వద్దకు వెళ్లిన రామచంద్ర యాదవ్ రైతుల పక్షాన పోరాటానికి పిలుపు ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మామిడి పంటకు కేజీ రు. 2 పెంచుతున్నామని జిల్లా కలెక్టర్ రామచంద్ర యాదవ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడిస్తోన్న కేజీ రు. 4కు అదనంగా రు. 2 పెంచి కేజీ మామిడి ధర రు. 6 గా నిర్ణయించారు. దీనిని రామచంద్ర యాదవ్ సూచన మేరకు భవిష్యత్తులో కేజీ ధర రు. 14 చేసేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతు .. దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు తాను పండించిన పంటకు మద్దతు ధర లేక రోడ్ల మీదకు వచ్చేసిన దుస్థితి నెలకొందన్నారు. పండ్లు అన్నింటికి రారాజు అని చెప్పుకునే మామిడి పంట పండించిన రైతు ఈ రోజు పంట అమ్ముకోలేని నిస్సహాయ స్థితికి వచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యేడాది పాటు పంటను అపురూపంగా కాపాడుకుని .. పంట చేతికి వచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేక... ప్రభుత్వ సహకారం లేక రోడ్లమీదకు వచ్చి నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి రైతులకు న్యాయం చేసి.. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న చిత్తశుద్ధి లేదని.. ఇదే చిత్తూరు జిల్లాలో గతంలో చెరకు పంటకు గిట్టుబాటు ధర లేక నాడు చెరకు రైతులు ఎంతో నష్టపోయారని రామచంద్ర యాదవ్ తెలిపారు. జిల్లాలో ఒకప్పుడు మామిడి తోటలు ఉన్న రైతు అంటే ఎంతో గొప్పగా ఉండేదని.. నేడు అదే రైతు తమ పంట అమ్ముకోలేని స్థితికి వచ్చేశాడని.. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు మామిడి పంటకు మద్దతు ధర కోసం పోరాడాల్సిన ప్రతిపక్ష నేత... రోడ్లమీదకి వెళ్లి చంపుతా.. నరుకుతా అన్న కామెంట్లు చేస్తూ జనాలను చంపుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఉండడం మన దౌర్భాగ్యం అని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. మామిడికి ప్రధానంగా కేజీకి రు. 15 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రు. 15 మద్దతు ధరతో పాటు మామిడి రైతులకు మ్యాంగో బోర్డు ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలన్నారు. ఇక స్థానిక రైతుల నుంచే మామిడి పంట ముందుగా కొనుగోలు చేయాలని కోరారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన పంటకు రైతులకు ఎలాంటి బిల్లులు ఇవ్వలేదని... వెంటనే ఈ బిల్లులు క్లీయర్ చేయాలని ఆయన కోరగా అందుకు కలెక్టర్ అంగీకరించారు. ఈ హామీలు వెంటనే నెరవేర్చకపోతే మామిడి రైతుల తరపున బీసీవై పార్టీ ఉద్యమం తీవ్రతరం చేస్తుందని రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.