బాబుకు అతి పెద్ద కష్టం.. మూడు సిలిండర్ల ముచ్చట అయిపోయిందా..?
మరి ఈ నేపథ్యంలో లబ్దిదారులు ఎవరు? ఎంతమందికి ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నారు? అసలు ఎంత మంది అర్హులు ? అనే విషయాన్ని ప్రబుత్వం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. ఏ పథకాన్ని అమలు చేయాలన్నా.. దీనికి సంబంధించిన లబ్దిదారుల వివరాలను సర్కారు ముందుగానే సేకరించాలి. గతంలో అంటే వలంటీర్లు ఉండేవారు. దీంతో ఎవరైనా లబ్ధిదారులు మిస్సయితే.. వెంటనే వారిని ఆయా పథకాల్లో చేర్చేవారు. కానీ, ఇప్పుడు వలంటీర్లు లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పైకి అంతా బాగున్నట్టే కనిపిస్తున్నా... ప్రజల్లో అంతర్గత విమర్శలు పెల్లుబుకుతున్నాయి. సరే.. ఇప్పుడు అమలు చేయాలని బావిస్తున్న మూడు సిలిండర్ల పథకాన్ని ఎవరికి ఇస్తారు? అనేది ప్రశ్న. వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో సిలిండర్ 1000 రూపాయలకు అటు ఇటుగా ఉంది. దీంతో కొంతైనా తమ కష్టాలు తీరుతాయన్నది మహిళల ఆలోచన.
కానీ, సర్కారు ఆలోచన వేరుగా ఉంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల(గతంలో దీపం) పథకం కింద ఎవరైతే.. సిలిండర్లు తీసుకున్నా.. వారికే దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ పథకంలో రాష్ట్రంలో కేవలం 12 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. వాస్తవానికి 5 కోట్ల మంది ప్రజలు, 3 కోట్ల కుటుంబాలు ఉన్న రాష్ట్రంలో కేవలం 12 లక్షల కుటుంబాలకే ఉచిత సిలిండర్లు ఇస్తే.. ప్రజలు ఊరుకుంటారా? అనేది ప్రశ్న. ఎలా చూసుకున్నా.. ఉచిత సిలిండర్ల పథకం సక్సెస్ కాకపోతే.. ఇబ్బందే!