అసెంబ్లీలో పవన్‌.. జగన్‌పై ఇంతగా రెచ్చిపోయారా?

Chakravarthi Kalyan
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి కొనసాగుతున్నాయి.  శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అదరగొడుతున్నారు.  ఈ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆయన స్పందించారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో భారీగా ఎక్సైజ్ శాఖలో అవకతవకలు జరిగాయన్నారు. వేల కోట్లు వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తమది పగ, ప్రతీకారం కాదని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ అదృష్టం బాగుంది కాబట్టే ఈ రోజు వైసీపీ వాళ్లు అసెంబ్లీలో లేకుండా పారిపోయారని అన్నారు. ఇక్కడ ఈ సీటులో ఉండి ఉంటే ఆయనకు చుక్కలు చూపించేవారిమని చెప్పారు.  గత ప్రభుత్వంలో తప్పులు చేసిన ఎవరిని తాము వదిలిపెట్టమని.. వారికి శిక్ష పడేలా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా అన్నారు.

మరోవైపు శ్వేతపత్రంలో చెప్పిన దానకంటే ఎక్కువ అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.18 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. లిక్కర్ స్కాంకు కారకులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని సీఎం చంద్రబాబుని కోరారు. తప్పులు చేసిన వారిని వదిలేస్తే మనకు మాట్లాడే నైతిక హక్కు ఉండదని.. రూ.20 వేల లంచం తీసుకుంటున్న సామాన్య ఉద్యోగిని శిక్షించగలుగుతున్న మనం.. ఇంత భారీ స్కాంకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదని సూచించారు. పెద్దోళ్లు తప్పు చేస్తే శిక్షలుండవా అని.. సామాన్యుడు ఫీల్ అవుతాడని.. అందుకే ఆ భావన వారిలో రానివ్వకుండా చూడాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: