15 సీట్లు వస్తాయంటూ 6 నెలల ముందే నివేదిక.. జగన్ కు ఫలితాలు ముందే తెలుసా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. వైసీపీ ఓడిపోవడం కంటే కంచుకోటల్లాంటి స్థానాల్లో వైసీపీకి షాకింగ్ ఫలితాలు రావడం పార్టీ నేతలను ఎంతగానో బాధ పెట్టింది. అయితే మాజీ సీఎం జగన్ కు 6 నెలల ముందే రాష్ట్రంలో ఇలాంటి ఫలితాలు వస్తాయని ఇంటెలిజెన్స్ నివేదిక అందిందని తెలుస్తోంది. యాంకర్ గా పాపులర్ అయిన జాఫర్ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు.
 
సీఎంకు, ముఖ్యమైన అధికారులకు ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పుడో చెప్పేశారని జాఫర్ అన్నారు. ఎస్పీ స్థాయి ఇంటెలిజెన్స్ లో పని చేసే ఆఫీసర్ నాకు ఒక రిపోర్ట్ పంపించారని జాఫర్ అన్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఎన్నికలకు ఆరు నెలల ముందే వైసీపీకి కేవలం 15 సీట్లకు మించి రావని ఎస్పీ స్థాయి అధికారి చెప్పారని జాఫర్ పేర్కొన్నారు.
 
ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎందుకు ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా చెబుతూ నివేదిక ఇచ్చాడని జాఫర్ పేర్కొన్నారు. ఆ తప్పులను వైసీపీ దిద్దుకోకుండా అదే సమయంలో రిపోర్ట్ ఇచ్చిన అధికారిని బదిలీ చేశారని ఆయన కామెంట్లు చేశారు. అప్పుడే వైసీపీ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేసి ఉంటే ఇంత దారుణమైన ఫలితం వచ్చేది కాదని జాఫర్ అభిప్రాయపడ్డారు.
 
పోలింగ్ పూర్తైన తర్వాత ఎక్కడెక్కడ వైసీపీ ఓడిపోతుందో ఎన్ని ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపొతుందో చెప్పారని జాఫర్ పేర్కొన్నారు. అయితే ఆ అధికారి పేరు రివీల్ చేయడానికి మాత్రం జాఫర్ ఇష్టపడలేదు. ఎన్నికల హామీల విషయంలో వైసీపీ చేసిన తప్పులు సైతం పార్టీకి మైనస్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జాఫర్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై వైసీపీ నుంచి రియాక్షన్ వస్తుందేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: