ఏపీ : చంద్రన్న పెళ్లికానుక పొందాలంటే కండిషన్స్ అప్లై..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి కొలువుదీరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా సమ ప్రాధాన్యత కల్పిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని, అదే క్రమంలో అనర్హులకు మాత్రం అందకూడదని చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం.గత ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లను మార్చేసి ప్రస్తుత ప్రభుత్వ పేర్లు పెడుతున్నారు. మరో రెండు పథకాల పేర్లను మార్చారు.గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. మైనార్టీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీస్‌గా మార్చారు. వీటిపై అధికారులు ఆదేశాలు జారీచేశారు.

 వైఎస్సార్ కళ్యాణమస్తు పేరుతో పథకాన్ని అమలు చేస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేవారు. ఇదే పథకాన్ని టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుకగా అమలు చేయబోతోంది.ఈ పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల ఆడపిల్లల వివాహాలకు రూ.లక్ష ఇచ్చేది. ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహాలకు రూ.75వేలు అందజేశారు. మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు ఇచ్చేవారు. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక కింద ఎంత ఇవ్వనున్నారనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.

 గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ప్రోత్సాహకాన్ని అందజేస్తుందా? మరింత పెంచుతుందా? అనే విషయం తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. చంద్రన్న పెళ్లికానుక కింద ప్రయోజనం పొందాలంటే పెళ్లి జరిగే సమయానికి వరుడికి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండాలి. ఇద్దరూ పదోతరగతి పూర్తి చేసివుండాలి. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కేవలం తొలి వివాహానికి మాత్రమే అందుతుంది. తెల్ల రేషన్ కార్డు కలిగినవారు అర్హులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: