50 ఏళ్లకే పెన్షన్‌: ఓసీ పేదలపై అంతకక్ష ఏంటి చంద్రబాబూ?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో ఎన్నికలు అత్యంత కీలకం. అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తుంటాయి. ఇందులో అత్యంత కీలకమైంది మ్యానిఫెస్టో. ఇందులో ఇచ్చే హామీలే ఆయా పార్టీల అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అందుకే మ్యానిఫెస్టో రూపకల్పనపై అన్ని రాజకీయ పార్టీలు అత్యంత శ్రద్ధగా  జాగ్రత్తగా రూపొందిస్తాయి.

ఇక ఏపీలో ఎన్నికలకు సమయం రోజుల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ కూటమి విడుదల చేసిన హామీలపై ప్రజలు చర్చించుకోవడం మొదలు పెట్టారు. వైసీపీ మ్యానిఫెస్టో బాగుందా? టీడీపీ ఎన్నికల ప్రణాళిక ఆకర్షణీయంగా ఉందా అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఇక అధికారమే లక్ష్యంగా ఇరు పార్టీలు హామీల వర్షంలో ఏపీ ప్రజలను తడిపి ముద్ద చేశాయి.

మ్యానిఫెస్టోలో అత్యంత కీలకమైన అంశం పింఛన్ల పెంపు. వైఎస్సార్ కానుక కింద ఇస్తున్న రూ.3వేల పింఛన్ ను తాము అధికారంలోకి రాగానే పెంచుకుంటూ రూ.4వేలకు తీసుకెళ్తాం అని వైసీపీ హామీ ఇచ్చింది. కూటమి మాత్రం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 ఏప్రిల్ నెల నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.4వేలు చేస్తామని హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల బకాయి మొత్తం కలిపి రూ.7వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇంతటితో ఆగకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే  పింఛన్ అందిస్తామని ప్రకటించేశారు. మరి ఓసీలోని నిరుపేదలు ఏం పాపం చేశారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓసీల్లో అందరూ ధనవంతులే ఉండరు అని.. పేదలు ఉంటారని. అగ్రకులంలో పుట్టి పేదరికం అనుభవిస్తున్న వారికి ఎందుకు పింఛన్ అమలు చేయరని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఒక్క వర్గంపై మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారని అడుగుతున్నారు. దీనిపై ఒక్కసారి పునః పరిశీలన చేయాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: