ఆత్మకూరు: సీనియర్ రెడ్డి Vs జూనియర్ రెడ్డి.. వార్ వన్ సైడేనా.?

Pandrala Sravanthi
• ఆత్మకూరులో సమఉజ్జుల పోటీ
• అభివృద్ధిలో ఇద్దరూ ఉద్దండులే..
• బీసీ,ఎస్సీ, ముస్లిం ఓట్లే కీలకం..
 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. ఈ జిల్లా నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు దేశ, రాష్ట్రస్థాయిలో రాణించారు.  ఇలాంటి నెల్లూరు జిల్లాను ఒకప్పుడు శాసించిన వారిలో ఆనం ఫ్యామిలీ కూడా ఒకటి. అలాంటి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  ఉమ్మడి జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంపై చాలామంది కన్నుపడింది. ఇక్కడ ఒక రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నేత మరో జూనియర్ నేత పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో  గెలుపు ఎవరి వైపు ఉంటుంది. ప్రజలు ఏ వైపు ఉన్నారు అనేది చూద్దాం.
  మేకపాటి వర్సెస్ ఆనం:

ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రం రెడ్డి ఆనం రామ నారాయణరెడ్డిలు తలపడుతున్నారు. ఇందులో మేకపాటి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. వ్యాపారం చేయడంలో అగ్రగన్యుడు. ఈయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తన సోదరుడి మరణం తర్వాతే అని చెప్పవచ్చు. ఈయన 2022 ఉప ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ప్రస్తుతం రెండవసారి కూడా వైసిపి నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక టిడిపి కూటమి నుంచి  ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. 1983లో  తెలుగుదేశం నుంచి పోటీ చేసి నెల్లూరు ఎమ్మెల్యేగా 1985 లో రావూరు ఎమ్మెల్యేగా చేశారు. 1999, 2004లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు సార్లు మంత్రి పదవి కూడా చేపట్టారు. ఇక 2016లో తిరిగి టిడిపిలో చేరారు 2018 లో వైసీపీలోకి వచ్చి 2023లో వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం టిడిపి నుంచి టికెట్ తెచ్చుకొని ఆత్మకూరులో బరిలో ఉన్నారు.
 గెలుపోటములు:
 ఆత్మకూరు నియోజకవర్గంలో కీలకంగా ముస్లిం, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గం ఓట్లే ఉంటాయి. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు   కీలకంగానే ఉన్నా కానీ ఇద్దరు రెడ్డి వర్గం వారే కాబట్టి  ఇద్దరికీ సమపాళ్లలో ఓట్లు పడే అవకాశం ఉంది. వీరి గెలుపును డిసైడ్ చేసేది ఎస్సీ, ముస్లిం, కమ్మ సామాజిక వర్గం వారే. ఈ సామాజిక వర్గాల వారు ఏ వైపు సపోర్ట్ చేస్తున్నారు అనేది చూద్దాం.
ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డికి మంచి పట్టు ఉంది. అంతేకాకుండా గతంలో ఆయన మంత్రి పదవి చేపట్టినప్పుడు చాలా అభివృద్ధి పనులు చేశారనే పేరు ఉంది.  అలాగే ఈ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వీరి బంధువులు బలంగా ఉన్నారు. ఇక మేకపాటి ఫ్యామిలీ ముందుగా కాంగ్రెస్ లో రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గరగా ఉండేవారు. ఆయన మరణాంతరం  జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే అందులోకి అందరూ షిఫ్ట్ అయిపోయారు. ఇక 2014లో తొలిసారిగా మేకపాటి గౌతంరెడ్డి పోటీ చేసి  గెలుపొందారు. ఆ తర్వాత 2019లో మరోసారి పోటీ చేసి గెలిచి మంత్రి పదవి చేపట్టి ఆయన కూడా ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయన ఆకస్మాత్తుగా మరణించడం తన సోదరుడు విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. అంతేకాకుండా నియోజకవర్గంలో సొంత నిధులతో బస్టాండ్లు, దేవాలయాలు, పేదల ను అవసరాలకు ఆదుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తన అన్న గౌతమ్ రెడ్డిపై సానుభూతి కూడా ప్రస్తుతం విక్రం రెడ్డికి కలిసివచ్చే అంశం.
 బలబలాలు:
ఓవైపు రామనారాయణరెడ్డి ఎంతో సీనియర్ నేత రాజకీయ ఉద్దండుడు. అంతేకాకుండా ఇప్పటికే ఆయన ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసి ఉన్నారు. ఇక మేకపాటి ఫ్యామిలీ కూడా ఈ నియోజకవర్గంతో విడదీయలేని ఆత్మీయతను ఏర్పరచుకుంది. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా అక్కడ వాలిపోతారు. ఈ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం మరియు ప్రజల్లో ఎవరికి ఆదరణ తక్కువగా లేదు. అభివృద్ధిలో ఉద్దండులే. దీంతో ఈ ఇద్దరికి సమపాళ్లలో బలాలు ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది క్లారిటీగా చెప్పడం కష్టంగా ఉంది. ఎవరు గెలిచినా కొద్దిపాటి తేడాతోనే గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: