ఏపీ: మీ ఆడబిడ్డనమ్మా! అడుక్కుంటున్నాను.. గెలిపించండమ్మా: షర్మిల

Suma Kallamadi
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అదేవిధంగా విపక్షాల ప్రచార కార్యక్రమాలకు కూడా నేటితో తెర పడనుంది. దాంతో నేతలు పరోక్షంగా సోషల్ మీడియాని ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైస్ షర్మిల 'పుట్టింటికి వచ్చిన ఈ ఆడబిడ్డను గెలిపించుకోండి! చేతులు జోడించి మరీ అడుగుతున్నాను! అంటూ పోస్ట్ పెట్టారు. ఇకపోతే రాజశేఖర్ బిడ్డ కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆమె పోస్టులో ఇంకేం పేర్కొన్నారంటే.. "కడప గడ్డ మీద న్యాయానికి, నేరానికీ జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయం వైపు నిలబడతారని నమ్ముతున్నాను." అని రాసుకొచ్చింది.
అదే విధంగా పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఎలాగైతే ప్రేమగా చూసుకుంటారో.. అలాగే నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డగా మీ అక్కున చేర్చుకుంటారని కోటి ఆశలు పెట్టుకున్నాను అని వెల్లడించారు. మే 13వ తేదీన జరిగే పోలింగ్‌లో ఎంపీ బ్యాలెట్ నమూనాలోని వరుస సంఖ్య ‘4’ మీద ‘హస్తం’ గుర్తు బటన్ నొక్కి రాజశేఖర్ బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగుచాచి మరీ అడుగుతున్నాను! అని రాసుకొచ్చారు షర్మిల. ఇకపోతే షర్మిల ఈ ఎన్నికల కోసం సొంత అన్న జగన్ ని వీడిన సంగతి విదితమే. దాంతో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. మరో వైపు కూటమి ఉండనే ఉంది.
ఈ నేపథ్యంలోనే షర్మిల అన్న జగన్ ను ఉద్దేశించి... ఓ మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్‌ రెడ్డి గారి నుంచి మీకు ఎందుకు రాలేదు జగనన్న? మీలా కేవలం ఒక లావాదేవీ కోసమో, లాభం కోసమో ఆలోచన చేసే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి బిడ్డని నేను అయినందుకు గర్వంగా ఉంది. నేను ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో కాంతిలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశాను. మీ గెలుపు కోసం పని చేశాను! కానీ నాకు ఏం మిగిలింది? అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు షర్మిల

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: