చంద్ర‌బాబు - ప‌వ‌న్ మేనిఫెస్టోపై మ‌త‌ల‌బు చూశారా...!

RAMAKRISHNA S.S.
మ‌రో 24 గంటల్లో ఏపీలో నామినేష‌న్ల ప‌ర్వానికి తెర‌దీయ‌నున్నారు. ఈ నెల 18(గురువారం) నుంచి ఏపీ స‌హా దేశ‌వ్యాప్తంగా మూడో ద‌శ ఎన్నిక‌ల నోటిఫిక‌ష‌న్ అందుబాటులో రానుంది. ఇక‌, ఇక్క‌డ నుంచి ఐదు రోజుల్లో నామినేష‌న్ల ప‌ర్వం సాగ‌నుంది. అయితే.. ఇప్ప‌టి వ‌రకు ఏపీలో ప్ర‌ధాన పార్టీలు.. ఓట‌ర్ల‌ను మ‌రింత ఆక‌ర్షించేందుకు మేనిఫెస్టోల‌ను పూర్తిగా రూపొందించ‌లేదు. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తామ‌ని చెబుతున్నారు.

అయితే.. ఇప్పుడున్న కూట‌మి ఎఫెక్టుతో ఈ ప‌థ‌కాల‌ను మ‌రింత పెంచే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిలో ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు సేవ‌ల‌ను అందించే విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. కానీ, ఇదే హామీని కూట‌మి పార్టీ అయిన‌.. టీడీపీ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తోంది. దీని ఎఫెక్ట్‌ నుంచిత‌మ‌ను తాము కాపాడుకునేందుకు వైసీపీ కూడా ఆర్టీసి ఉచిత ప్ర‌యాణానికి మొగ్గు చూపేందుకు అవ‌కాశం ఉంది.

ఇక‌, మిగిలిన వాటిలో య‌థాతథంగా అమ‌లుకు వైసీపీ మొగ్గు చూప‌నుంది. ఇదిలావుంటే.. కూట‌మి పార్టీల‌కు సంబంధించిన మేనిఫెస్టోపైనే మ‌త‌ల‌బు క‌నిపిస్తోంది. ఉచితాలు తాము వ్య‌తిరేక‌మ‌ని చెబుతున్న బీజేపీ ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో ఇచ్చింది. దీనిలో ఒకే ఒక్క ఉచిత ప‌థ‌కం ఉంది. అది కూడా.. ఉచిత  రేష‌న్‌. దీనికి మించి.. మిగిలిన‌వ‌న్నీ కూడా.. ప్ర‌జ‌ల‌కు ఉచితంగా ఏదీ రాదు. కానీ, టీడీపీ ప్ర‌వ‌చిస్తున్న సూప‌ర్ సిక్స్ వంటివి పూర్తి ఉచితంగానే ఉన్నాయి.

దీంతో ఉమ్మ‌డిగా మేనిఫెస్టోను విడుద‌ల చేస్తే.. జాతీయ స్తాయిలో బీజేపీ కి ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో మేనిఫెస్టోలో సూప‌ర్ సిక్స్ పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. రేపు ప్ర‌ధాని వ‌చ్చి.. మేనిఫెస్టోను చూపిస్తే.. దానిలో మెజారిటీ ఉచిత ప‌థ‌కాలు ఉంటే.. జాతీయ స్థాయిలో ద్వంద్వ విధానం అవ‌లంబిస్తున్నార‌నే వాద‌న‌నుబీజేపీ ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీంతో ఈ పార్టీ నాయ‌కులు.. దీనిని స‌రిదిద్దాల‌ని చెబుతున్నారు. కానీ, చంద్ర‌బాబు దీనికి ఒప్పుకోవ‌డం లేదు. ఫ‌లితంగా కూట‌మి మేనిఫెస్టోపై ఇంకా చ‌ర్చ‌లు సాగుతూనే ఉన్నాయి. మ‌రి చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: