సీమ(పెనుకొండ): ఉషాశ్రీ వర్సెస్‌ సవితమ్మ.. ఆమెదే గెలుపు?

Chakravarthi Kalyan
రాయలసీమలో ఆసక్తికరమైన పోరు జరుగుతున్న నియోజకవర్గాల్లో పెనుకొండ ఒకటి. మొదటి నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేసింది. ఈసారి ఇక్కడ వైసీపీ, కూటమి ఇద్దరూ మహిళా అభ్యర్థులనే బరిలో నిలిపారు. వైసీపీ మంత్రి, కురుబ సామాజిక వర్గానికి చెందిన ఉషాశ్రీ చరణ్‌ను ఇక్కడి నుంచి బరిలో నిలిపగా.. టీడీపీ కూటమి కూడా కురబ సామాజిక వర్గానికే చెందిన సవితమ్మ పోటీలో దింపారు.

వాస్తవానికి మంత్రి ఉషాశ్రీ చరణ్‌ సొంత స్థానం కల్యాణ దుర్గం. ఆమె గత ఎన్నికల్లో అక్కడి నుంచే గెలిచారు. అయితే ఈసారి ఆమెకు అక్కడ అంత సానుకూలత లేదన్న కారణంతో జగన్‌ ఆమెను పెనుకొండకు మార్చారు. నాన్‌ లోకల్‌ కావడం ఉషాశ్రీ చరణ్‌కు పెద్ద మైనస్‌గా మారింది. దీనికితోడు కల్యాణదుర్గంలో ఆమె ట్రాక్‌ రికార్డు అంతగా లేకపోవడం.. రెండో విడతలో మంత్రి పదవి వచ్చినా ఆమె ఈ  ప్రాంతానికి చేసిందేమీ లేదన్న పేరు తెచ్చుకోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా బెంగళూరులోనే ఉంటారన్న పేరు కూడా మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు నెగిటివ్‌గా మారుతోంది.

ఇక టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న సవితమ్మ కూడా కురుబ మహిళే. దీనికితోడు ఆమె లోకల్‌ కావడం కలసివస్తోంది. సవితమ్మ గతంలో టీడీపీ హయాంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పని చేశారు. మంచి రాజకీయ కుటుంబం అన్న పేరు ఉంది. దీనికి తోడు సవితమ్మ భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇది కూడా ఇక్కడ ఆమెకు కలసివస్తోంది. కురుబలు, కమ్మలతో పాటు బీసీ సామాజికవర్గ ఓట్లపై సవితమ్మ ఆశలు పెట్టుకున్నారు.

ఇక మంత్రి  ఉషాశ్రీ చరణ్‌ది కూడా కులాంతర వివాహమే. ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె కురుబ, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు తనకు కలసివస్తుందని భావిస్తున్నారు. అయితే నాన్‌లోకల్ కావడం.. ఎమ్మెల్యే, మంత్రిగా మంచి పేరు తెచ్చుకోకపోవడం ఆమెకు మైనస్‌గా మారుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ హోరాహోరీ పోరులో కూటమి అభ్యర్థి సవితమ్మకే మొగ్గు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: