సికింద్రాబాద్ పైనే కాంగ్రెస్ నజర్...రంగలోకి కీలక నేత..!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్ సభ స్థానంపై కన్నేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ ఇంచార్జ్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. సికింద్రాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. దీంతో రాబోయే ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేర్చుకొని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. సికింద్రాబాద్ స్థానంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకరం చుట్టింది. ఇదిలా ఉండగా, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ లతో సమావేశమై దిశ నిర్దేశం చేశారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన నివాసంలో అసెంబ్లీ ఇంచార్జ్ లతో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్ష నిర్వహించారు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ సైతం సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఇటీవల పద్మారావు అధ్యక్షతన సమావేశాలు కూడా జరిగాయి. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, అటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్ సభ స్థానం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుండి గెలిచి, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. దీంతో బీఆర్ఎస్ దానంని ఓడించాలని డిసైడ్ అయ్యింది. దీంతో ఈ సీటును కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డిని రంగంలోకి దింపినట్టు టాక్ వినిపిస్తోంది. మరి చివరికి ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందా..? కాంగ్రెస్ గెలుస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: