పప్పులో కాలేసిన నితీష్... పాపం పరువుపోయిందిగా...!

రాజకీయ నాయకులు ఏం మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడాలి. మైక్ దొరికింది కదా అని ఏదో ఒకటి మాట్లాడితే విమర్శల పాలు అవ్వక తప్పదు. ఒకసారి మాట్లాడితే ఆ మాటను వెనక్కి తీసుకోలేము.. మరోవైపు ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రభావం వల్ల ఒకసారి జనాల్లోకి వెళ్లిందంటే దానిని ఆపలేము. ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ పై జోరుగా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల బీహార్ లోని నవాడా సభలో ప్రధాని నరేంద్ర మోడీ సాక్షిగా లోక్ సభ ఎన్నికల గురించి బీహార్ సీఎం 25 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సభలో నితీష్ చిత్రవిచిత్రంగా ప్రవర్తించారు. ఆయన ప్రసంగాన్ని విన్న బీజేపీ నేతలతో పాటు ఆయన సొంత పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ప్రసంగంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 4000 సీట్లు గెలుస్తుందని అన్నారు. 4,000 మంది ఎంపీలు కచ్చితంగా గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రసంగం అనంతరం బీహార్ సీఎం మోడీ పక్కన కూర్చున్నారు. తన ప్రసంగం చాలా బాగుంది అని మోడీ మెచ్చుకోగానే నితీష్ ప్రధాని కాళ్లు మొక్కారు. దీంతో నరేంద్ర మోడీతో పాటు సభకు హాజరైన వారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తాజాగా ఆ సభకు సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై అసెంబ్లీలో వివక్షనేత తేజస్వి యాదవ్ స్పందిస్తూ నితీష్ పై విమర్శలు గుప్పించారు. నితీష్ సీఎం పదవిని మర్చిపోయి బీహార్ పరువు తీశారని మండిపడ్డారు. మోదీ కాళ్లు మొక్కి తన పరువు తానే తీసుకున్నారని అన్నారు. సభలో ఆయన చేసిన ప్రసంగమంతా తప్పులు తడకల ఉందని చెప్పుకొచ్చారు. లోక్ సభలో కేవలం 543 సీట్లు మాత్రమే ఉన్నాయని కానీ, నితీష్ 4000 సీట్లు గెలుస్తామని ఎలా ధీమా వ్యక్తం చేశారంటూ విమర్శల వర్షం కురిపించారు. తేజస్వి యాదవ్ తో పాటు కాంగ్రెస్ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ బీహార్ సీఎంపై విమర్శలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: