కాంగ్రెస్ లోకి BRS ఎమ్మెల్యే..ముహూర్తం ఫిక్స్..?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు వరస షాక్ లు తగులుతున్నాయి. కొంతమంది నేతలు బీజేపీలో చేరుతుంటే మరి కొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడటం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీని వీడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.

తెల్లం వెంకట్రావు ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల కుటుంబంతో సహా ఆయన సీఎంను కలవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం దాదాపు ఖరారై పోయిందనుకున్నారు. కానీ తెల్లం పార్టీ మారడాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక ఈనెల 12న మునుగూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓ సభ జరిగింది. ఈ సభకు కాంగ్రెస్ నాయకులతో పాటు  వెంకట్రావు హాజరవ్వడం చర్చకు దారితీసింది.

మరోవైపు ఇల్లందులో జరిగిన మహబూబాబాద్ లోక్ సభ స్థాయి కాంగ్రెస్ సమావేశానికి సైతం తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలానే ప్రవర్తిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం తెల్లం ఎలాగూ కాంగ్రెస్ గూటికి చేరే ఎమ్మెల్యే అని ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో చర్చ మొదలయ్యింది. తెల్లం వెంకట్రావు ఈ నెల 6న కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం అందుతుంది.

తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ మేనిఫెస్టో సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన పలువురు సీనియర్ నేతలు స్థానిక ఇన్చార్జిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ  వెంకట్రావు మాత్రం రాహుల్ గాంధీ కోసమే ఇంతకాలం వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సభలో తెల్లం వెంకట్రావు ఒకరే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా..? మరికొందరు బీఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ గూటికి వెళతారా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs

సంబంధిత వార్తలు: