కేసీఆర్ కు శాపంగా మారిన ఆ హామీనే జగన్ కు శాపంగా మారనుందా..?

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ పార్టీ... అనేక పథకాలను ప్రవేశపెట్టిన పార్టీ... అయినప్పటికీ ఓడిపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులను పట్టించుకోకపోవడమే అనే అరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నామని పదే పదే చెప్పారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల సమస్యలు తీరలేదు. వారు ఆశించిన మేర ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదు. మరోవైపు ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయి.

దీంతో నిరుద్యోలు ఎవరు బీఆర్ఎస్ కు అసలు సపోర్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఏపీలోనూ అదే రిపీట్ కాబోతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల కోసం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.  ఏపీలో కొలువుల జాతర సృష్టిస్తామని పలుమార్లు అన్నారు. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు మాటిచ్చారు. కానీ సీఎం జగన్ ఆ మాటను నిలబెట్టుకోలేదు. మరోవైపు ఆశించినమేర రాష్ట్రానికి ప్రైవేట్ కంపెనీలను సైతం తీసుకురాలేదు. దీంతో ఏపీలోనూ నిరుద్యోగ సమస్య ఏర్పడింది.

నిరుద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. కాబట్టి ఏపీలోనూ నిరుద్యోగ యువత నిర్ణయం పైనే ప్రభుత్వం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ జాబు రావాలంటే బాబు రావాలి అని ప్రచారం చేసుకుంటుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రైవేట్ కంపెనీలు తీసుకువస్తామని చెబుతోంది. అంతేకాకుండా జగన్ హయాంలో పలు కంపెనీలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళాయని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగులు కూటమివైపు మొగ్గు చూపితే ఏపీలో మరోసారి జగన్ రావడం కష్టమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: