రేవంత్‌ రెడ్డి: ఇవాళైనా ఆ లెక్క తేలుస్తారా? ఇంకా నానుస్తారా?

Chakravarthi Kalyan
తెలంగాణలో రాష్ట్రంలో మిగిలిన నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. వాటిని కాంగ్రెస్‌ ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రం దిల్లీలో జరగనున్న సమావేశంలో ఈ నాలుగు లోక్‌సభ స్థానాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిల్లీ వెళ్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు గెలుచుకోవడంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌  అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. మూడు దశల్లో ఇప్పటికే 13 మంది పేర్లు ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ హరీశ్‌చౌదరి ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతల అభిప్రాయాలను సేకరించారు. నాలుగు స్థానాలపై దాదాపు  ఏకాభిప్రాయం వచ్చింది.

వరంగల్‌లో కడియం శ్రీహరి కుమార్తె కావ్యను బరిలోకి దించేందుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డికి టికెట్‌ ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరీంనగర్‌ అభ్యర్ధి ఎంపిక మాత్రం చాలా టఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.  రెడ్డి, వెలమ, బీసీ సామాజికవర్గాలకు చెందిన నాయకులు టికెట్‌ కోసం ఇక్కడ పోటీ పడుతున్నారు.

అయితే.. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి వైపే రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి సుప్రీం కోర్టు న్యాయవాది షహనాజ్‌కు టికెట్‌ ఖరారు అయ్యే అవకాశం ఉందని ఇండియా హెరాల్డ్‌కు సమాచారం అందింది. ఇక కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెళ్తున్నారు.  స్క్రీనింగ్‌ కమిటీ నివేదికతోపాటు సునీల్‌ కనుగోలు సర్వేను అధిష్ఠానానికి నివేదిస్తారు. మరి ఇవాళైనా ఆ నాలుగు సీట్ల లెక్క తేలుస్తారా.. ఇంకా నానుస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: