హైదరాబాద్ : రేవంత్ ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా ?

Vijaya


పరిపాలనలో రేవంత్ రెడ్డి తనదైన ముద్ర చూపించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందులో తప్పేమీలేదు. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలనలో తమదైన ముద్రను జనాలు గుర్తుంచుకోవాలని తపిస్తారు. తెలంగాణాకు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ కూడా అలాగే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విషయం ఏమిటంటే కాలికి సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో ఉన్న కేసీయార్ ను రేవంత్ వెళ్ళి పరామర్శించటం బాగుంది.



నిజానికి రేవంత్, కేసీయార్ మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పన్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయం రాజకీయమే పరామర్శ పరామర్శే అన్నట్లుగా ఉంది రేవంత్ వ్యవహారం. మంచిదే ఇదే ఒరవడిని రేవంత్ కంటిన్యుచేస్తే రాజకీయాలు కాస్తయినా మారుతుందేమో. ఇక ప్రోటోకాల్ విషయంలో కూడా రేవంత్ ప్రభుత్వం బాగానే వ్యవహరించింది. మహిళలకు ఉచితబస్సులు, ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను రు. 5 లక్షల నుండి రు. 10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే.



మామూలుగా అయితే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అధికారపార్టీ ఎంఎల్ఏలు, నేతలే చేసేస్తుంటారు. ప్రతిపక్ష ఎంఎల్ఏలను దరిదాపులకు కూడా  రానీయరు. పదేళ్ళు కేసీయార్ చేసిందిదే అని అందరికీ తెలుసు. కానీ తాజాగా పై కార్యక్రమాలను సనత్ నగర్లో బీఆర్ఎస్ ఎంఎల్ఏ తలసాని శ్రీనివాసయాదవ్ ప్రారంభించారు. అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద రేవంత్ ప్రభుత్వం వాళ్ళకు ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇదికూడా మంచి పరిణామమనే చెప్పాలి.



ఇక కేసీయార్ ను పరామర్శించటం కోసం రేవంత్ ఆసుపత్రికి వెళ్ళినపుడు అక్కడ జనాలు గుమిగూడారు. సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను బాధితుల నుండి రేవంత్ అక్కడే తీసుకుని సంబంధిత అధికారులకు పంపించటం హ్యాపీగా ఉంది. అలాగే ఆసుపత్రిలోకి రేవంత్ అడుగుపెట్టగానే ఒకమ్మాయి రేవంతన్నా అని గట్టిగా పిలిచింది. వెంటనే రేవంత్ వెనక్కు తిరిగారు. తనను పిలిచిన అమ్మాయిని గుర్తించి చాలా స్పీడుగా అమ్మాయి దగ్గరకు వెళ్ళారు. ఒక్కరోజు బిల్లు లక్ష రూపాయలు కట్టమంటున్నారని అమ్మాయి రేవంత్ కు మొరపెట్టుకున్నది. వెంటనే తాను చూసుకుంటానని హామీ ఇచ్చి ఆ విషయాన్ని చూడమని అధికారులను ఆదేశించారు. తనది నిజమైన ప్రజాప్రభుత్వమని రేవంత్ నిరూపించాలని అనుకుంటున్నట్లు అర్ధమవుతోంది.  ప్రయత్నంలో చిత్తశుద్ది ఉంటే జనాలందరికీ మంచిదే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: