అమరావతి : ఈ సర్వేలను నమ్ముకుంటే అంతేనా ?
జాతీయ మీడియా సంస్ధల్లో ఏది సర్వే నిర్వహించినా కామన్ ఎలిమెంట్ ఏమిటంటే జాతీయస్ధాయిలో ఎన్డీయేదే గెలుపు. రాష్ట్రంలో వైసీపీకి తిరుగులేని విజయం. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేయటం. లోక్ సభ సీట్లలో 24 లేదా 25 సీట్లూ వైసీపీ ఖాతాలోనే పడతాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మరోసారి ఘోరపరాజయం తప్పదని సర్వేలు జోస్యం చెబుతున్నాయి.
ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా టైమ్స్ నౌ ఒక సర్వే ఫలితాలు ప్రకటించింది. దానిప్రకారం ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 51.3 శాతం ఓటు షేర్ తో బంపర్ విక్టరి ఖాయమట. 24 లేదా 25 ఎంపీ స్ధానాల్లో అధికారపార్టీయే విజయం సాధిస్తుందని చెప్పింది. జూన్ 15-ఆగష్టు 12 మధ్య సర్వే జరిపినట్లు టైమ్స్ నౌ చెప్పింది. తాజా సర్వే ఫలితాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి తరచు చెప్పే వైనాట్ 175కి చాలా దగ్గరలో ఉన్నట్లే అనుకోవాలి.
సర్వే ఫలితాలు ఓకే కానీ గ్రౌండ్ రియాలిటి అలాగే ఉందా ? లేదనే అనిపిస్తోంది. సర్వే ఫలితాల ప్రకారం చూసుకుంటే టీడీపీకి ఇపుడున్న 23 సీట్లు కూడా వచ్చే అవకాశంలేదు. కానీ వాస్తవం అలా లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వంపై సహజంగా ఉండే అసంతృప్తి బాహాటంగానే కనబడుతోంది. పైగా కొందరు ఎంఎల్ఏలపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని స్వయంగా జగనే వర్క్ షాపుల్లో పదేపదే చెబుతున్నారు.
జగన్ నమ్మకమంతా సంక్షేమపథకాల లబ్దిదారులే. లబ్దిదారుల్లో నూటికి 50 మంది ఓట్లేసినా చాలు మళ్ళీ అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు. అధికారంలోకి వస్తామని అనుకోవటం వరకు బాగానే ఉందికానీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు చెప్పటంపైనే అనుమానంగా ఉంది. ఈ సర్వేలను నమ్ముకుంటే అంతే సంగతులు. ఎందుకంటే సర్వేలు నిజమవుతాయని అనుకునేందుకు లేదు. 2014లో సర్వేలు ఇలాగే చెప్పి జగన్ దే అధికారం అన్నాయి. అప్పుడేమైందో అందరు చూసిందే.
2019కి వచ్చేసరికి 151 సీట్లు వస్తాయని బహుశా జగన్ కూడా ఊహించుండరు. సర్వేలను పక్కనపెట్టేస్తే బెంగుళూరుకు చెందిన ఒక ఇండిపెండెంట్ సంస్ధ చేసిన సర్వేలో వైసీపీకి నికరంగా 42 శాతం ఓటుబ్యాంకు ఉందని తేలిందట. అంటే లబ్దిదారుల్లో 100 శాతం వైసీపీకి మద్దతుగా నిలబడతారని అనుకుంటేనే 42 శాతం ఓట్లుషేరుందట. టీడీపీకి 40 శాతం ఓట్లున్నాయని తేలిందని సమాచారం. అయితే అభ్యర్ధులు, పోల్ స్ట్రాటజీ, పోలింగ్ రోజు ఓట్లేయించుకోవటం లాంటి అనేక అంశాల మీద గెలుపోటములు ఆధారపడున్నాయన్న విషయం తెలిసిందే.