అమరావతి : రాజీనామా చేసి ఏడవచ్చు కదా ?
వైసీపీ రెబల్ ఎంఎల్ఏల వ్యవహారం భలే విచిత్రంగా ఉంటోంది. రాజీనామాలు చేయకుండానే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతుంటారు. రాజీనామాలు చేయచ్చుకదా అని అడిగితే సమయం వచ్చినపుడు చేస్తామని చెప్పి తప్పించుకుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ అమరావతి ప్రాంతంలో సభ నిర్వహించారు. ఆ సభలో తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ప్రజల కోసం పోరాడుతున్న టీడీపీకి అండగా ఉండి 175 సీట్లలో గెలిపించాలన్నారు.
అమరావతి కల నెరవేరాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందే అన్నారు. దేవతల రాజధానిని తలపించేలా చంద్రబాబు అమరావతిని నిర్మించి ప్రజలకు ఇస్తారట. తన వల్ల అమరావతికి అన్యాయం జరిగినందుకు క్షమించమని వేడుకున్నారు. రైతులపై పోలీసులు లాఠీలను ఝుళిపిస్తుంటే బాధగా ఉండన్నారు. ఇకనుండి రైతులు, మహిళలను ముట్టుకోవాలంటే ముందే తనను దాటాలని సినిమా డైలాగులు పేల్చారు. వైసీపీ తరపున గెలిచినందుకు అమరావతి ఉద్యమంలోకి రాలేకపోయారట. ఇకనుండి తన వెనుక చంద్రబాబు, లోకేష్ వుంటారన్న ధైర్యంతో ఉద్యమంలోకి దూకుతానని చెప్పారు.
అమరావతి రైతులు, మహిళలను తాను కూడా మోసం చేసినట్లు చెప్పారు. రైతులు, మహిళలు బాధలతో బహిరంగంగా ఏడిస్తే తాను ప్రతిరోజు ఇంట్లో ఏడ్చేవారట. ఇలా ఇంట్లో ఏడ్చేబదులు ఏకంగా రాజీనామా చేసేస్తే అసలు ఏడ్చే అవసరమే ఉండదు కదా. ఎంఎల్ఏగా ఉండటం వల్లే కదా రోజు ఏడ్వాల్సి వస్తోందన్న ప్రశ్నకు మాత్రం శ్రేదేవి సమాధానం చెప్పటంలేదు.
ఒకపుడంటే ఎంఎల్ఏగా రాజీనామా చేస్తే మళ్ళీ ఉపఎన్నికలు వస్తాయి గెలుస్తామో లేదో అన్న అనుమానం ఉండేది. కానీ షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది తొమ్మిది నెలలే కాబట్టి ఉపఎన్నికలు వస్తాయన్న భయంలేదు. కాబట్టి రెబల్ ఎంఎల్ఏలు ధైర్యంగా ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేసేయచ్చు. అమరావతి సాధనలో సమిధనైపోవటానికి కూడా సిద్దంగా ఉన్న శ్రీదేవికి ఎంఎల్ఏకి రాజీనామా చేయటం పెద్ద పనికాదు. అమరావతి నుండే వైసీపీ పతనం మొదలైందని చెప్పిన ఎంఎల్ఏ అదేదో తన రాజీనామాతోనే శ్రీకారం చుట్టి చూపిస్తే బాగుంటుందేమో.