అమరావతి : అనుకున్నది సాదించిన జగన్

Vijaya


మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధించారనే అనుకోవాలి. అమరావతి రాజదాని ప్రాంతంలో కొత్తగా సృష్టించిన ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ళు నిర్మించాలన్న కోరికకు శ్రీకారంచుట్టారు. ఆర్ 5 జోనును కొత్తగా ఏర్పాటుచేసి అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీచేసి తర్వాత పక్కా ఇళ్ళను నిర్మించాలన్నది జగన్ సంకల్పం. అనుకున్నట్లుగానే ముందుగా ఆర్ 5 జోన్ ఏర్పాటుచేశారు. అయితే దీన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకించింది.



ఆర్ 5 జోన్ కు వ్యతిరేకంగా జేఏసీ ముసుగులో టీడీపీనే కోర్టులో కేసులు వేయించింది. అయితే ఆర్ 5 జోన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి అధికారం ఉందని కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసు విచారణల మీద విచారణలు జరిగి తీర్పిచ్చేందుకు చాలాకాలమే పట్టింది. తర్వాత 51 వేలమంది పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని అనుకుంటే దాన్ని కోర్టు ద్వారా అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలిచ్చేందుకు లేదని మళ్ళీ కొందరు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా పెద్ద పోరాటంచేసి ప్రభుత్వం అడ్డంకిని అధిగమించింది.



పేదలకు పట్టాలిచ్చి ఇళ్ళు నిర్మించాలని అనుకోగానే వెంటనే మళ్ళీ జేఏసీ కోర్టులో కేసువేసి అడ్డుకున్నది. ఇక్కడ కూడా పెద్ద పోరాటం చేయాల్సొచ్చింది. కేసుపై విచారణలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణాలకు జగన్ శంకుస్ధాపన చేశారు. అయితే కోర్టు తీర్పును రిజర్వుచేసుంచింది. అంతిమ తీర్పు ఏమిటన్నది సస్పెన్సుగా మారింది. అయినా సరే అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెంలో పట్టాల పంపిణీ చేసి ఇళ్ళ నిర్మాణానికి జగన్ శ్రీకారంచుట్టారు.



ఆరుమాసాల్లో 51 వేల ఇళ్ళనిర్మాణాలు జరిగిపోవాలని జగన్ డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. ఇదే సమయంలో మౌళికసదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే పనులు మొదలుపెట్టేసింది. ఇళ్ళ నిర్మాణాలు, మౌళిక సదుపాయాలకు ప్రభుత్వం రు. 1825 కోట్లు ఖర్చుపెట్టబోతోంది. కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతోందో తెలీదుకానీ ఈలోగానే ఇళ్ళ నిర్మాణాలను జగన్ మొదలుపెట్టేశారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అమరావతి ప్రాంతంలో పెద్ద ఊరే వెలవటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: