అమరావతి : వీళ్ళ నమ్మకాలు వీళ్ళని గెలిపిస్తాయా ?
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించి అధికారంలోకి రావాలని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పదే పదే పరితపిస్తున్నారు. ఇక్కడ కేవలం పరితపిస్తున్నారని మాత్రమే ఎందుకన్నామంటే ప్రయత్నాలేవీ చేయటంలేదు కాబట్టే. కేవలం కలలు మాత్రమే కంటున్నారు వీళ్ళిద్దరు. ముఖ్యమంత్రి అయిపోవాలనే కోరికుంటే, కలలు కన్నంత మాత్రాన సరిపోదు కదా. అందుకు తగ్గట్లే కృషి కూడా చేయాలి. జనాల మనసులు గెలుచుకోవాలి. అప్పుడే జనాల్లో నమ్మకం పెరిగి ఓట్లేస్తారు.
కానీ చంద్రబాబు, పవన్ ఇలాంటి పనులేమీ చేయకుండానే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ చిత్తుచిత్తుగా ఓడిపోతారని ఒకటికి వందసార్లు చెప్పినంతమాత్రాన సరిపోదు. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను అడ్వాంటేజ్ గా తీసుకుని జనాల్లోకి వెళ్ళినపుడే జనాలు కూడా నేతలను నమ్ముతారు. సరే ఆపని చేయలేకపోతున్నారు కాబట్టే చంద్రబాబు, పవన్ చెరో విషయంమీద బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఇంతకీ అదేమిటంటే చంద్రబాబు ఏమో ఎల్లోమీడియా మీదే నమ్మకంపెట్టుకున్నారు.
ఇదే సమయంలో పవన్ ఏమో పొత్తులే తనను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతాయని నమ్ముతున్నట్లున్నారు. నిజానికి చంద్రబాబుకు ఎల్లోమీడియానే ప్రధమశతృవు. జనాల్లో టీడీపీ మీదున్న అభిప్రాయం కనబడకుండా, పార్టీలోని లోపాలను పూర్తిగా కప్పేట్టేస్తోంది ఎల్లోమీడియా. జగన్ మీదేమో నూరుశాతం వ్యతిరేకంగా వార్తలు, కథనాలు అచ్చేస్తు టీడీపీ మీద అదేస్ధాయిలో బ్రహ్మాండం బ్రహ్మాండమని కథనాలు ఇస్తోంది. దాంతో చంద్రబాబు ఎల్లోమీడియాలో వచ్చేదంతా నిజమే అనుకుంటున్నారు.
ఇక పవన్ విషయం చూస్తే ఒకవైపు జనసేనకు ఓట్లేసి గెలిపించమని అడుగుతునే మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేదిలేదంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే అందరితోను పొత్తులు పెట్టుకోవాలి. తలా కొన్ని సీట్లలో పోటీచేసి వైసీపీని ఓడించాలనేది పవన్ ఆలోచన. ఆలోచన వేరు వాస్తవరూపంలోకి రావటంవేరు. పవన్ ఆలోచన ఆచరణలోకి రావటం కష్టమే. సరే భ్రమల్లో బతికేస్తున్నాడు కాబట్టి పొత్తులు పెట్టేసుకుంటే చాలు అధికారంలోకి వచ్చేసినట్లే అని నమ్ముతున్నారు. మరి వీళ్ళద్దరి నమ్మకాలు వీళ్ళని ఏ మేరకు అధికారంలో కూర్చోబెడతాయో చూడాల్సిందే.