రష్యా దాడి: ఆ నగరమే తుడిచి పెట్టుకుపోయిందా?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ దేశంపై రష్యా దూకుడు రోజురోజుకూ పెరుగుతోంది. అత్యాధునిక క్షిపణులతో విరుచుకుపడుతోంది. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇల్లు, అపార్ట్‌మెంట్లు... దేన్నీ లక్ష్య పెట్టకుండా మానవత్వం లేకుండా రష్యా దాడి చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆరోపిస్తున్నారు.  తాజాగా మరియుపోల్‌లో 400 మంది శరణార్థులు తలదాచుకుంటున్నఓ పాఠశాలపై రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో మరియుపోల్‌లో అతి పెద్ద ఉక్కు కర్మాగారం కూడా మూతపడింది.

దాడుల్లో పిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాలని అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులకు  మరియుపోల్‌ పోలీసు అధికారి మిఖాయిల్‌ విజ్ఞప్తి చేస్తూ ఓ వ వీడియో విడుదల చేశారు. విదేశాలు తగిన సాయం అందించకుంటే ఈ భూమ్మీద నుంచి మరియు పోల్‌ అనే నగరం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందని ఆయన విజ్ఞప్తి చేశారు. మరియుపోల్ వాసులను రష్యాకు వెళ్లిపోవాలని పుతిన్ సేనలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి చొచ్చుకొచ్చే కొద్దీ ఉక్రెయిన్‌ నగరాల నుంచి పొరుగు దేశాలకు జనం వలస పోతున్నారు. ఇప్పటికే ప్రజలు తరలి వెళ్లేందుకు వీలుగా 10 మానవత క్యారిడార్లు ఏర్పాటు చేశారు. ఈ కారిడార్లలోని 8 కారిడార్ల నుంచి ఒక్కరోజే 7 వేల మంది తరలిపోయారు. ఇలా వెళ్లిన వారిలో మరియుపోల్‌ నగరం నుంచే 4 వేల మందిపైకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌ పైకి రష్యా దూసుకువస్తున్న తీరు చూస్తే.. ఆ దేశాన్ని ఆక్రమించుకునే ఉద్దేశ్యం లేదన్న పుతిన్ మాటలు కూడా నమ్మశక్యంగా లేవని అమెరికా వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు ఉక్రెయిన్ చర్చలకు సిద్దమని పదే పదే ప్రకటిస్తున్నా.. సమస్యకు పరిష్కార మార్గం చూడకుండా దాడులతో రెచ్చిపోవడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రష్యా దాడులతో నగరాలకు నగరాలే భస్మీపటలం అవుతున్న తీరు చూస్తే హృదయాలు ద్రవించకమానవు. మరి ఈ యుద్ధం
ఎప్పుడు ఆగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: