గుడ్‌న్యూస్‌: ఇండియాలో భారీగా జపాన్ పెట్టుబడులు?

Chakravarthi Kalyan
ఇది ఇండియాకు నిజంగా శుభవార్తే.. ఇండియాలో దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని జపాన్‌ దేశం నిర్ణయించింది. భారత్- జపాన్ మధ్య 14 వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో.. ప్రధాని మోదీతో సమావేశమైన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఈ విషయం వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఇరు దేశాలు నిర్వహించిన చర్చల్లో..
భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్‌ ప్రధాని వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో రూ.3.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని జపాన్ తెలిపింది. ఇదే సమయంలో ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న ఉక్రెయిన్‌ పరిణామాలపైనా ప్రధానులు మోదీ, కిషిడా చర్చించారు. ఈ విషయంలో ఆచితూచి స్పందించిన మోదీ, కిషిడా.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దేశాలు నడుచుకోవాలని సూచించాయి. అలాగే.. ఆఫ్గానిస్తాన్, మయన్మార్‌ సంక్షోభాలు, దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు వంటి అంశాలపైనా  మోదీ, కిషిడా చర్చించారు.

ఈ నేపథ్యంలో రక్షణ, ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఓ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే సంయుక్తంగా సాగిస్తున్న  సైనిక విన్యాసాలను కొనసాగించాలని కూడా భారత్‌, జపాన్‌ నిర్ణయించాయి. గతంలో అంతర్జాతీయ అంశాలలో చురుకుగా వ్యవహరించే జపాన్ ఇప్పుడు మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉండటం జపాన్‌ను కలవర పరుస్తోంది.

గతంలో ప్రపంచ యుద్ధం కారణంగా బాగా నష్టపోయిన దేశాల్లో జపాన్‌ ఒకటి. ఆ దేశంపైనే మొదటి అణుబాంబు కూడా పడింది. అణుబాంబు పర్యావసనాలు బాగా తెలిసిన దేశం జపాన్. అందుకే అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉండాలని.. వాటిని అతిక్రమించకూడదని సాఫ్ట్‌గా సలహా ఇస్తోంది. ఇక ఇండియా కూడా శాంతి కాముక దేశమే అయినా.. రష్యాతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఈ విషయంలో యుద్ధ నివారణకు తగినంత చొరవ చూపించలేకపోతోంది. అంతే కాదు. ఈ యుద్ధాన్ని ఆయిల్‌ దిగుమతికి అనుకూలంగా ఇండియా మలచుకుంటోందన్న విమర్శలను కూడా ఎదుర్కొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: