చంద్రబాబు మెడకు పెగాసస్.. డైవర్షన్‌ కోసమేనా?

Chakravarthi Kalyan
నాలుగేళ్ల క్రితం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు  ఏపీ ప్రభుత్వం పెగాసస్ స్పై సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిందని తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు మెడకు చుట్టుకుంటున్నాయి. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. అందులోనూ పొరుగు రాష్ట్రానికి చెందిన నేత.. అందులోనూ ఫైర్ బ్రాండ్‌గా దేశమంతా పేరున్న నాయకురాలు మమతా బెనర్జీ ఈ ఆరోపణలు చేయడంతో చంద్రబాబు డిఫెన్సులో పడిపోయారు.

అయితే.. ఇదంతా ప్రశాంత్ కిషోర్ డైవర్షన్‌ స్కీమ్‌లో భాగమేనని తెలుగు దేశం ఆరోపణలను తిప్పి కొడుతోంది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం పెట్టి మరీ ఈ విషయాన్ని ఖండించారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్న ప్రత్తిపాటి పుల్లారావు... ప్రభుత్వ చేతగానితనం, అసమర్ధత వల్లే 25 మంది మృతి  చెందారన్నారు. ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి వైకాపా ప్రభుత్వం మరో అంశాన్ని తెరపైకి తెస్తోందన్న ప్రత్తిపాటి.. పెగాసెస్ అంశం అప్పటి డిజిపి సవాంగ్ ఏమీ లేదని తేల్చాడని గుర్తు చేశారు.

ఒక వేళ చంద్రబాబు ఆ స్పైవేర్ కొంటే.. మూడేళ్లు ఏం చేశారు నిద్రపోతున్నారా గాడిదలు కాస్తున్నారా అంటూ ప్రత్తిపాటి మమతా బెనర్జీ తీరును విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రత్తిపాటి అంటున్నారు. మద్యం ధరలు పెంచడంతో నాటుసారా అన్ని జిల్లాల్లో వ్యాపించిందని.. మద్యనిషేధం హామీ మరచి... నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రత్తిపాటి విమర్శించారు.

తాజాగా మచిలీపట్నంలో వైసీపీ నేత వేధింపులతోనే నాగలక్ష్మి బలైందని మాజీ మంత్రి ప్రత్తిపాటి ఆరోపించారు. యడ్లపాడు మండలం బోయపాలెం లో అంగన్వాడీ ఆయాను వైకాపా నాయకుడు వేధించాడని.. తాడేపల్లిలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఈ దుర్మార్గాలు కనబడటం లేదా అని మాజీ మంత్రి ప్రత్తిపాటి ప్రశ్నించారు. మూడేళ్లుగా వైకాపా ప్రజా ప్రతినిధులు ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసన్న ప్రత్తిపాటి... ఇప్పుడు ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళతారని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: