సాక్షి టీవీకి షాక్‌: కోర్టుకెక్కిన ఉద్యోగులు..?

Chakravarthi Kalyan
సాక్షి టీవీకి కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ రానందువల్ల ఆ చానల్‌ అనుమతులు రద్దు చేస్తున్నామని కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. సాక్షి టీవీని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆ సంస్థకు 2021 డిసెంబరు 31వ తేదీన సమాచార శాఖ షో కాజ్‌ నోటీసు జారీ చేసిందట. అయితే ఈ నోటీసుకు సాక్షి టీవీ సంస్థ గతనెల 13న సమాధానం ఇచ్చిందట.

సాక్షి చానల్‌కు కేంద్ర హోంశాఖ అనుమతులు ఎందుకు ఇవ్వలేదో తెలియదని.. అయితే.. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఇందిరా టెలివిజన్‌ కోరిందట. అయితే.. ఈ వివరణను పరిశీలించిన సమాచార, ప్రసార శాఖ.. హోంశాఖ సెక్యూరిటీ   క్లియరెన్స్‌ లేకుండా సాక్షి టీవీ ప్రసారాల అనుమతిని పునరుద్ధరించలేమని చెప్పేసిందట. ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌కు జారీ చేసిన అనుమతిని రద్దు చేస్తున్నామని తెలిపిందట. అనుమతించిన ప్రైవేట్‌ చానళ్ల నుంచి సాక్షి టీవీ పేరు తొలగిస్తున్నట్టు తెలిపిందట.

ఈ పరిణామంతో డిఫెన్సులో పడిన సాక్షి యాజమాన్యం.. ఉద్యోగుల ద్వారా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించినట్టు తెలుస్తోంది. సాక్షి  అనుమతులు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ చానల్‌ సిబ్బంది తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. చానల్‌ ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తోందని.. రద్దు ఆదేశాలను కొట్టివేయాలని కోరారట. అనుమతుల పునరుద్ధరణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సాక్షి ఉద్యోగులు పిటిషన్‌ వేశారు. అంతే కాదు.. తగిన కారణాలు చూపకుండానే కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను  నిరాకరించిందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారట.

తమ చానల్‌పై ఏదైనా ప్రతికూల చర్య తీసుకునే ముందు సంస్థ వాటాదారులు, కార్మికులు, వినియోగదారులు, ఇతరుల ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉందని వాదించారట. ఇందుకు విరుద్ధంగా చానల్‌ అనుమతులు రద్దు చేశారని.. ఇది చెల్లదని.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ అయ్యాయని వాదించారట. గతంలోనూ ఇలాగే ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌కు టెలిపోర్ట్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తే  హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారట. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు సాక్షి టీవీకి ఊరట ఇచ్చింది.  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేనెల 11వరకూ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: