మల్లన్నసాగర్: ఇవాళ ఆవిష్కృతం కాబోతున్న అద్భుతం..?
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక ఆయకట్టుకు నీటి సరఫరా ఈ మల్లన్నసాగర్‌తోనే జరుగుతుంది. ఈ మల్లన్న సాగర్ వల్ల తాగు, పారిశ్రామిక అవసరాలకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మల్లన్న సాగర్‌ను భారీ మట్టికట్టతో నిర్మించారు. మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ ను కట్టారు. ఈ మల్లన్న సాగర్ నిర్మాణానికి చాలా నేపథ్యం ఉంది. మొదట ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతలలో భాగంగా కేవలం ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతోనే రిజర్వాయర్ నిర్మించాలని భావించారు.
కానీ కేసీఆర్ సీఎం అయ్యాక రీ డిజైనింగ్‌లో భాగంగా ప్రాణిహిత చేవెళ్ల కాస్త కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మారింది. ఆ తర్వాతే మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని ఏకంగా 50 టీఎంసీలకు పెంచారు. ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక మిగిలిన రిజర్వాయర్లైన కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు మల్లన్న సాగర్ ద్వారానే నీటిని ఎత్తిపోస్తారు.
ఈ మల్లన్న సాగర్ ద్వారా కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు రాబోతోంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా నిజాంసాగర్, సింగూరు, ఘనపూర్ ఆయకట్టు స్థిరీకరణ కూడా జరుగుతుంది. అలా కొత్తది, స్థిరీకరణ కలిపి సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు మల్లన్నసాగర్ ద్వారా నీరు అందుకోబోతోంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధికంగా నిర్వాసితులైంది కూడా మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారానే. అంతే కాదు.. తక్కువ కాలంలోనే పూర్తి చేసిన భారీ రిజర్వాయర్ ఇది. దీన్ని కేసీఆర్ ప్రారంభిస్తున్న సందర్భంగా.. అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.