మోదీ ధీమా: యూపీ మాదే.. మెజార్టీ సీట్లే తేలాలట..!

Chakravarthi Kalyan
ఉత్తర ప్రదేశ్‌లో మళ్లీ బీజేపీదే గెలుపుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు పూర్తయిన యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా యూపీలోని కన్నౌజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర  మోదీ  ప్రసంగించారు. యూపీలోని విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు.. తేలాల్సిందే కేవలం ఎన్ని సీట్లు ఎక్కువ వస్తాయన్నదే అంటూ దీమా వ్యక్తం చేశారు మోదీ. యూపీలో బీజేపీయే వస్తుందని రాష్ట్రమంతా తెలుసని.. యోగి మళ్లీ సీఎం అవుతారని దేశమంతా తెలుసని మోడీ అంటున్నారు. బీజేపీ జోరుతో ప్రతిపక్ష నేతలు నిద్రపోవడంలేదని.. అందుకే  కులతత్వాన్ని పెంచి, మతతత్వాన్ని ప్రచారం చేస్తున్నారని మోడీ విమర్శించారు. ఎన్నికల్లో  ఓట్లను చీల్చాలని చూస్తున్నారని..  మాఫియాలు, అల్లరి మూకలకు వ్యతిరేకంగా యూపీ ప్రజలు మాత్రం బీజేపీకే ఓటేస్తున్నారని మోడీ అంటున్నారు.


యూపీలో ప్రజలంతా ఐక్యంగా బీజేపీకే ఓటు వేస్తున్నారని..ఇది నాకెంతో సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అంటున్నారు. అల్లరి మూకలు, గూండాలకు బీజేపీ ప్రభుత్వం దగ్గరే తగిన చికిత్స దొరుకుతుందని యూపీలోని సాధారణ ఓటర్లకు కూడా అర్థమైందంటున్నారు మోడీ. పేదలకు ఇళ్లు, పేద మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ , రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి లబ్ధి వంటి సౌకర్యాలు అందించిన పార్టీ బీజేపీయేనని..  లక్షలాది మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఉచిత వైద్య చికిత్సలు చేయించామని..  దశాబ్దాల క్రితంనాటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేశామని మోడీ చెప్పుకొచ్చారు.


ఇప్పటికే యూపీలో తొలివిడత ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు పోలింగ్ జరిగిన తీరు చూసి.. వారసత్వ పార్టీల నేతలకు నిద్ర కరవైందంటున్నారు మోడీ. చివరకు వారసత్వ పార్టీల నేతలు కలలు కూడా కనలేకపోతున్నారని.. కుటుంబ పార్టీలే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మార్చేశాయని మోడీ అంటున్నారు. వీరికి ప్రజాస్వామ్యమంటే.. కుటుంబం చేత కుటుంబం కొరకు ఏర్పాటైన ప్రభుత్వం అంటూ ప్రధాని వ్యంగ్యంగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: