ఢిల్లీ : రాజుగారి ధైర్యమింతేనా ?
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ధైర్యం ఏమిటో తెలిసిపోయింది. ఫిబ్రవరి 5వ తేదీవరకు తన పార్టీకి, నాయకత్వానికి ఇచ్చిన గడువు దాటిపోయినా రాజుగారి నుండి ఒక్కమాట కూడా లేదు. తనపై అనర్హత వేటు వేయించటానికి పార్టీ నాయకత్వానికి ఫిబ్రవరి 5వ తేదీవరకు ఎంపీ గడువిచ్చారు. చేతనైతే తనపై అనర్హత వేటు వేయించడంటు సవాలు విసిరారు. ఒకవేళ ఫిబ్రవరి 5వ తేదీలోగా తనపై అనర్హత వేటు వేయించలేకపోతే తానే రాజీనామా చేసేస్తానని బంపరాఫర్ కూడా ఇచ్చారు.
అంటే అనర్హత వేటు వేయించటానికైనా, రాజీనామా చేయటానికైనా రాజుగారు ఫిబ్రవరి 5వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించారు. అయితే డెడ్ లైన్ దాటి రెండు రోజులైపోయినా రాజుగారు మాత్రం నోరెత్తలేదు. అనర్హత వేటు వేసే విషయంలో విచారణకు హాజరుకావాలంటు లోక్ సభ ప్రివిలేజ్ కమిటి రాజుకు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 3వ తేది. మరి 3వ తేదీన ప్రివిలేజ్ కమిటి సమావేశమయ్యిందా ? ఎంపీ హాజరయ్యారా ? హాజరైతే ఏమి చెప్పారో తెలీదు.
సరే ప్రివిలేజ్ కమిటి సమావేశాన్ని పక్కనపెట్టేసినా స్వయంగా ఎంపీనే చెప్పిన ఫిబ్రవరి 5వ తేదీ గడువు అయిపోయింది కదా. మరి తన రాజీనామా ప్రకటనను ఎందుకు చేయలేదు ? తన నియోజకవర్గం నరసాపురంలో ఏమన్నా తేడాలొచ్చేసినాయా ? తానుకాబట్టే నరసాపురంలో వైసీపీ గెలిచిందని చెప్పుకుంటున్న ఎంపీకి అసలు విషయం బోధపడిందా ? నిజానికి వైసీపీ తరపున పోటీచేశారు కాబట్టే రాజు గెలిచారు. అదే మరే పార్టీ తరపున పోటీ చేసుంటే తెలిసేది రాజుగారి కెపాసిటి ఏమిటో ?
ఏ పార్టీ తరపున పోటీచేస్తే గెలుస్తాను అన్న విషయాన్ని బాగా సర్వే చేయించుకున్నారు. అందుకనే చంద్రబాబునాయుడు పిలిచి టికెట్ ఇచ్చినా టీడీపీని కాదనుకుని వచ్చి వైసీపీలో చేరి పోటీచేసింది. కాబట్టి నిజంగానే రాజీనామా చేయటం వల్ల ఉపఎన్నిక వస్తే అపుడు రాజుగారి కెపాసిటి ఏమిటో అందరికీ తెలుస్తుంది. మరి రాజు ఎప్పుడు రాజీనామాను ప్రకటిస్తారు ? ఎప్పుడు ఉపఎన్నిక వస్తుందో ?