మోదీ బడ్జెట్ : ఆడమ్మా ఆడు ! పాడమ్మా పాడు ! బోల్ బేబీ బోల్ యార్ !
కొత్త బడ్జెట్ కు సంబంధించి కొన్ని ఆశలున్నాయి.కొన్ని కలలు కూడా ఉన్నాయి.అదేవిధంగా ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో కన్నా ఈ ఏడాది రైతుకు దక్కే సాయంపైనే చాలా ఆశలున్నాయి.ఎందుకంటే పంటల బీమా అమలులో ఉన్నా దానిని అందుకుంటున్న రైతులు కొందరే ఉన్నారు.కనుక విపత్తుల వేళ రైతులను కేంద్రం ఏ విధంగా ఆదుకుంటుంది అన్నది ఆసక్తిదాయకమే! ఎందుకంటే చాలా సార్లు బీమా అందక, పంట నష్టమూ రాక సర్వం కోల్పోయి రోడ్డున పడిపోతున్న రైతులకు కేంద్రం ఇచ్చేది ఏమీ లేదు. రాష్ట్రం సాయం కూడా సున్నాగానే ఉంది. ముఖ్యంగా విపత్తు నిర్వహణ నిధిని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తీవ్ర తుఫానుల వేళ సర్వం కోల్పోయినా కూడా కాస్తో కూస్తో ఇలాంటి నిధి ఒకటి ఉంచి,దానికి కొంత నిధులు కేటాయిస్తే మేలు.
ఉపాధి రంగాలకు చేయూతనివ్వాలి.అస్సలు దేశంలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లే లేనప్పుడు యువకులంతా ఎటు పోవాలి.కనుక స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలి.మరీ! ముఖ్యంగా ప్రయివేటు రంగాలకు ఊతమిచ్చేటప్పుడు వాటి నుంచి దేశానికి దక్కే ప్రయోజనాలేంటి అన్నది ఆలోచించాలి. ఉపాధి రంగం ఇవాళ పూర్తిగా ప్రయివేటు రంగంతో ముడిపడి ఉండడం వల్ల కొంతలో కొంతయినా ప్రోత్సహకాలు అందిస్తే బాగుంటుంది.రుణాల మంజూరుపై కేంద్రం కాస్త కరుణ చూపిస్తే బాగుంటుంది. అంటే స్వయం ఉపాధికి ఊతమిస్తే చాలు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కు సంబంధించి ఆలస్యం అయినా ఏదో ఒక పని చేసుకుని బతికే సమూహాలు ఉన్నాయి.వాటికో ఊతం ఇవ్వడం ద్వారా నిరుద్యోగం కొంతయినా తగ్గించవచ్చు. ముఖ్యంగా కుటీర పరిశ్రమలకు ఎటువంటి హామీ లేకుండా కొంతలో కొంత మొత్తం రుణం అందిస్తే అవి నిలదొక్కుకుంటాయి.ముద్ర రుణాల పేరిట బ్యాంకులు ఇప్పటికే డ్రామాలు ఆడుతున్నాయి కనుక రుణాల మంజూరులో ఉన్న నిబంధనలు కాస్త
సరళీకృతం చేస్తే మేలు. ఇవేవీ కాకుండా పథకాల పేరిట అంకెల డ్రామా ఆడకుండా ఉంటే ఇంకా మేలు.