మోదీ బడ్జెట్ : పెగాసస్ చీకట్లో పార్లమెంట్ ?
ఆ విధంగా పార్లమెంట్ సభ్యులకు కాస్త బుద్ధి కాస్త ఇంగితం
(షరతు : అందరికీ కాకున్నా కొందరికి)
దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఉదయం కాఫీటైం లో
కాసిన్ని సంగతులు...
ఎప్పటిలానే సమావేశాలు..ఎప్పటిలానే ఆవేశాలు/ఎప్పటిలానే కోపాలు..ఎప్పటిలానే వాయిదాలు/ఎప్పటిలానే అరుచుకోవడాలు ..ఎప్పటిలానే తిట్టుకోవడాలు/ఎప్పటిలానే మైకులు విరగొట్టడాలు/ఇంకా కత్తీ డాలూ అందుకోవడమే లేటు.మిగతావన్నీ షురూ చేయుండ్రి.ఇదీ ఇవాళ్టి లేదా రేపటి ఉభయ సభల సభ్యుల తీరు.సభ్యులు హుందాగా నడుచుకోవాలని సభా సంప్రదాయాలను పాటించాలని సభాపతులు పదే పదే విన్నవిస్తూనే ఉన్నా, వేర్వేరు పద్ధతుల్లో సంబంధిత సందేశాలను సభ్యులకు చేరవేస్తున్నా ఎప్పటిలానే ఇప్పుడు కూడా! ఎప్పటిలానే పార్లమెంట్ సమయం కూడా! అసందర్భ మాటలకు ఆనవాలు. అసందర్భ ప్రేలాపనలకు ఆనవాలు.
బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.ఇదే సమయంలో పార్లమెంట్ లో పెగాసస్ ప్రకంపనలు రేగనున్నాయి. గత సారి కూడా ఇవే ఆరోపణలు ఇవే ప్రత్యారోపణలతో కాలం నెట్టుకు వచ్చిన స్వపక్ష,విపక్షాలు ఈ సారి కూడా టైం పాస్ పాలిటిక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.పెగాసస్ స్పై సాఫ్ట్ వేర్ కొనుగోలు కు సంబంధించి ఇజ్రాయిల్ తో కేంద్రం ఒప్పందం పెట్టుకుందన్న ఆరోపణల నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్ భగ్గుమంటోంది.దీంతో సభా కార్యక్రమాల నిలుపుదలకు ఈ సారి కూడా బడ్జెట్ పై చర్చ జరిగే సందర్భంగా ప్రయత్నించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్పై కు సంబంధించిన సాఫ్ట్ వేర్ కొనుగోలుపై దర్యాప్తు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కానీ కేంద్రం మాత్రం అవన్నీ వినిపించుకునే స్థితిలో అయితే లేదు.ఎప్పటిలానే తానేం చేయాలనుకుంటుందో అదే చేయనుంది కూడా!
ఇప్పటికే కేంద్రంపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని సుప్రీం కోర్టును కొందరు ఆశ్రయిస్తూ పిటిషన్ ను దాఖలు చేశారన్న వార్తలు నిర్థారణలో ఉన్నాయి.వీటినే ప్రధాన మీడియా ఇవాళ వెల్లడి చేస్తోంది. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై సుప్రీం ఏం అంటుందో అన్నది కూడా ఆసక్తికరంగానే ఉంది. 2017లో భారత్ - ఇజ్రాయిల్ మధ్య జరిగిన ఒప్పందంలో గూఢ చర్యానికి సంబంధించి స్పై వేర్ ను కొనుగోలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపిందని ఇందుకు పదిహేను వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని న్యూయార్క్ టైమ్స్ చెబుతోంది.ఈ మాటే ఇప్పుడు విపక్షంలో దుమారం రేపుతోంది. తమపై నిఘా ఉంచి తమకు సంబంధించిన వివరాలన్నీ ఇప్పటికే కేంద్రం తన గుప్పిట్లో ఉంచుకుందని విపక్ష నేత రాహుల్ మండి పడుతున్నారు.దీనిపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు చేపట్టాలని కూడా కాంగ్రెస్ పట్టుబడుతోందని ప్రధాన మీడియా వెల్లడిస్తున్న కథనం.