జగనన్న : ఎన్టీఆర్ ఆశయ సాధకుడా నీకు వందనం?
వాస్తవానికి కృష్ణా జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాలు విజయవాడ, మచిలీ పట్నం.. మచిలీ పట్నం పార్లమెంట్ సెగ్మెంట్ ను అదే పేరులో ఉంచుతూనే జిల్లాగా ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లా ఉండనుంది. గుడివాడ, పెనమలూరు, గన్నవరం,పెడన,మచిలీపట్నం,అవనిగడ్డ,పామర్రు అనే ఏడు అసెబ్లీ నియోజకవర్గాలతోనే ఈ జిల్లా ఉండనుంది. రెండు రెవెన్యూ డివిజన్లు, (గుడివాడ,మచిలీపట్నం) 25 మండలాలు ఉండనున్నాయి. విస్తీర్ణ 3775 చదరపు కిలోమీటర్లు.జనాభా 17.358లక్షలు.
ఇంతవరకూ బాగానే ఉంది.మచిలీపట్నం పోర్టుకు సంబంధించి కానీ ఇంకా అక్కడే ఉన్న కృష్ణా విశ్వ విద్యాలయంతో సహా ఇతర విద్యా సంస్థల పనులకు సంబంధించి కానీ ఇంకా చాలా పనులకు సంబంధించి కానీ ఇకపై ఏ లోటూ ఉండదు అని మనం అనుకోవాలి.ఆ విధంగా సమర్థ ప్రభుత్వాలు ఉంటాయి అని కూడా అనుకోవాలి.అనుకున్నా సరే! ఇక విజయవాడ లోక్ సభ నియోజకవర్గంను జిల్లాగా ఏర్పాటు చేసే క్రమంలో ఆ ప్రాంతం పేరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గా మార్చారు.బాగుంది.ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్న వైసీపీ ఆలోచన బాగుంది.ఆ విధంగా కమ్మ సామాజికవర్గంను ఇంప్రెస్ చేశారు.ఇంకా చెప్పాలంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ అప్పుడెప్పుడో పాదయాత్రలో చెప్పారు. తరువాత ఆ సంగతి మరిచిపోయారు.ఏదేమయినప్పటికీ విగ్రహాల ఏర్పాటులో టీడీపీ, పేర్లు ఊర్లు ఏర్పాటులో వైసీపీ భలేగా ఎన్టీఆర్ ను వాడుకుంటున్నాయి.ఇంతకూ ఆయన వినిపించిన ఆత్మగౌరవ నినాదాన్ని మాత్రం ఎవరు వినిపిస్తారో? మరి!