కళ్లు చెదిరే ఆదాయం: కేసీఆర్‌ గల్లా పెట్టె ఫుల్‌..?

Chakravarthi Kalyan
తెలంగాణ సర్కారుకు ఇది నిజంగా శుభవార్తే.. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ఏ రేంజ్‌లో కొనసాగుతోందో చెప్పేందుకు ఈ లెక్కలు ఉదాహరణగా నిలుస్తాయి. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల రాబడి ఒక్కటే రూ.10 వేల కోట్ల దిశగా చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చార్జీలు భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఆదాయంలో ఆ చార్జీల పెంపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి రెండో వారం వరకూ రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,759 కోట్ల రాబడి వచ్చిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఇదే జోరు ఇలాగే కొనసాగితే.. రిజిస్ట్రేషన్ల ద్వారానే రాష్ట్రానికి పది వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన 7,759 కోట్ల రూపాయల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,151 కోట్లు వరకూ వచ్చాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ద్వారా రూ.6,608 కోట్ల ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఒక్కో నెలా క్రమంగా పెరుగుతోంది. ఒక్క డిసెంబర్‌లోనే రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,118 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇదే రోజు కొనసాగితే.. అంటే.. జనవరి, ఫిబ్రవరి, మార్చి.. ఈ మూడు నెలల్లోనూ యావరేజ్‌గా నెలకు రూ.1,000 కోట్లు వచ్చినా... ఈ ఆర్థిక సంవత్సరంలో సర్కారు ఆదాయం పది వేల కోట్లకు చేరుకుంటుంది. అదే జరిగిదే... తెలంగాణలో మొట్ట మొదటిసారి రిజిస్ట్రేషన్ల రాబడి రూ.10 వేల కోట్ల మార్కు చేరుకున్నట్టు అవుతుంది.

ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,500 కోట్లు ఆదాయం రావచ్చని ప్రభుత్వ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, రియల్‌ ఎస్టేట్‌ దూకుడు పెరగడమే ఈ ఆదాయానికి మార్గంగా చెప్పుకోవచ్చు. కేవలం పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లోనూ భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: