హ్యాపీ క్రిస్మస్ : దేవుడి పాలనలో అంతా క్షేమమా!
తమది దేవుడి పాలన అని చెబుతారు జగన్. అందుకు అనుగుణంగానే తాను నడుచుకుంటానని అంటుంటారు జగన్. అయితే ఇవాళ క్రిస్మస్ కదా! దేవుడి పాలన ఎలా ఉంది..బాగుందా లేదా అన్నది కూడా చూడాలి. జగన్ ముందు నుంచి నమ్ముకున్న సంక్షేమం అయి తే బాగుందని ప్రజల నుంచి కితాబులు అందుకుంటున్నారు. అంతేకాదు ఆయనకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇచ్చిన మాట మాత్రం అస్సలు తప్పడం లేదు. పథకాల విషయంలో ఆయన మొదట నుంచి తీసుకుంటున్న శ్రద్ధ బాగుంది కానీ మిగతా విషయాల్లో మాత్రం ఆయన వెనుకబడిపోతున్నారు.
పాలనకు సంక్షేమం ఒక్కటే ప్రాతిపదిక అని అనుకోవడంలోనే జగన్ తరుచూ ఫెయిల్ అవుతున్నారు. అంతేకాదు పాలనకు లెక్క కు మిక్కిలి పారదర్శకత లోపంగానే పరిణమిస్తోంది. సంక్షేమం కోసం నిధులు తెచ్చినా అవన్నీ వాటి కోసమే వెచ్చిస్తున్నారా లేదా ఇతర పనుల కోసం ఏమయినా కేటాయిస్తున్నారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. పోనీ రాష్ట్రానికి ఆదాయం ఏమయినా తగ్గిందా అంటే కరోనా వేళల్లో మినహా పెద్దగా ఆదాయం అయితే తగ్గలేదు అని లోటు ఉన్నా తాము సర్దుబాటు చేస్తూనే ఉన్నామని చెబుతోంది కేంద్రం. అయినా కూడా నిధుల లేమి తమను వెన్నాడుతోందని కేంద్రంకు రాష్ట్ర పెద్దలు చెప్పడం హాస్యాస్పదం. అంతేకాదు అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు అన్నది లేనేలేదు.జిల్లాల పర్యటనల ఊసు లేనేలేదు. కొన్ని కేసుల ఊసుల కారణంగా ఆయన కేంద్రాన్ని నిలదీస్తున్నదీ లేదు. మరి! జగన్ పాలనలో అదేలేండి దేవుడి పాలనలో తప్పిదాలకు దిద్దుబాటు లేదా?