గ్రీన్ సిగ్నల్‌ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మరో బూమ్..?

Chakravarthi Kalyan
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే దూసుకుపోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంది. ఇక ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టుల ప్రకటనలతో నగర శివార్లలో రియల్ ఎస్టేట్ రంగంలో జోరు కనిపిస్తోంది. ఇప్పుడు దానికి మరో బూమ్ తోడయ్యింది. అదే రీజనల్ రింగ్ రోడ్.. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ నగర విస్తరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తెరపైకి వచ్చి ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ నలుమూలలా రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది.


అయితే.. ఈ ప్రాజెక్టులో ఇటీవల పురోగతి కాస్త మందగించిందన్న అంసతృప్తి రియల్టర్లలో ఉన్న నేపథ్యంలో ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. రీజనల్ రింగ్ రోడ్.. ఆర్‌.ఆర్‌.ఆర్‌ తొలిదశ నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియకు కేంద్రం పచ్చజెండా ఊపేసింది. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ  చేపట్టాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ  తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. భూసేకరణకు పచ్చజెండా ఊపడం అంటే ప్రాజెక్టు చాలావరకూ ముందుకు కదిలినట్టే.


ఈ రీజనల్ రింగ్ రోడ్  సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, యాదాద్రి, భువనగిరి, చౌటుప్పల్‌ మీదుగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌లను పరిశీలించిన కేంద్రం తాజాగా ప్రాజెక్టునకు ఆమోదముద్ర వేసింది. ఈ భారీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా.. భారీ ప్రాజెక్టు కావడంతో దీని నిర్మాణం చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ ను 25 నుంచి 30 సంవత్సరాల ట్రాఫిక్‌ అంచనాలతో నిర్మించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.


ఈ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 338 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా. అయితే భూసేకరణకు అనుమతి వచ్చింది.. 157 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మాత్రమే.. ఈ దారికి లైన్ క్లియర్ అయ్యింది. ఇంకా చౌటుప్పల్‌- చేవెళ్ల-శంకర్‌పల్లి-ఆమనగల్‌-సంగారెడ్డి మీదుగా 181 కిలోమీటర్ల రహదారికి మాత్రం ఇంకా లైన్ క్లియర్ కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: