బీసీలతో పాటు కాపులపైనా ఈ వివక్ష ఎందుకు..?
- హైదరాబాద్ అభివృద్ధిలో కాపులకు, బీసీలకు శూన్యహస్తం
- రాజకీయ పెత్తనం కోసమే రంగా హత్య
- ఓట్ల కోసం వాడుకుని ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారు
- బిసి, కాపు, దళితులు ఏకమవ్వాల్సిన చారిత్రాత్మక సమయం ఆసన్నమైంది
- బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ సంచలన వ్యాఖ్యలు
సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల మాదిరిగానే, కాపు సామాజిక వర్గం కూడా దశాబ్దాలుగా వివక్షకు, అణిచివేతకు గురవుతోందని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజధానిలో బిసిలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలనే డిమాండ్ తో బిసివై పార్టీ ఉద్యమిస్తోందన్నారు. ఇదే తరహాలో రాజధానిలో కాపులకు కూడా వాటా ఇవ్వాలని, అందుకోసం బిసివై పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలు, కాపు పెద్దలు ఈ అంశంపై స్పందిస్తే బాగుంటుందన్నారు. అంతకుముందు, స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, సినిమా రంగాలతో సహా ప్రతి రంగంలో కాపులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారిని అణగదొక్కే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో అధికారంలో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ఫిలిం సిటీ, హోటళ్లు, కంపెనీల పేరుతో వేల ఎకరాల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టుకున్నాయని, కానీ ఆ భూ కేటాయింపుల్లో బీసీలకు, కాపులకు దక్కింది శూన్యమని విమర్శించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి మూలస్తంభంగా నిలిచిన దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావుకు హైదరాబాద్‌లో కనీసం సెంటు భూమి కేటాయించకపోవడమే కాపులపై జరిగిన అన్యాయానికి నిలువుటద్దమని పేర్కొన్నారు.
రాజకీయంగా కూడా బీసీలను, కాపులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని, ఉత్సవ విగ్రహాల్లాంటి నామమాత్రపు పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఒక విప్లవాత్మక మార్పు కోసం ఉద్యమిస్తే, ఆ ఉద్యమం కొనసాగితే రాష్ట్రంలో తమ పెత్తనం, దోపిడీ అంతమవుతుందనే భయంతోనే ఆయనను హత్య చేశారని, ఈ నిజాన్ని అందరూ గుర్తించాలని పిలుపునిచ్చారు. రంగా వేసిన అడుగులు ముందుకు సాగి ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో కాపుల స్థానం ఉన్నతంగా ఉండేదన్నారు. బిసిలు, కాపులు, దళితులు ఏకం కావాల్సిన చారిత్రాత్మక సమయం ఆసన్నమైందని రామచంద్రయాదవ్ తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు.