నువ్వు నాకు నచ్చావ్ @24 ఏళ్లు..ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?
నువ్వు నాకు నచ్చావ్ సినిమా 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 4K హంగులతో తిరిగి మళ్ళీ థియేటర్లోకి రాబోతోంది. 2026 నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటవ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రీ- రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత స్రవంతి రవికిషోర్ తెలియజేశారు. నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం.. ఈ సినిమాని 4K హంగులతో పరిపూర్ణంగా ఆస్వాదించండి అంటూ తెలిపారు. అప్పట్లో ఈ సినిమా విదేశాలలో కూడా పూర్తిస్థాయిలో రిలీజ్ కాలేదు అందుకే ఆ లోటును ఇప్పుడు భర్తీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నామంటూ నిర్మాత తెలిపారు.
ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా, యూరప్, యూకే వంటి దేశాలలో తెలుగు ప్రేక్షకుల కోసం విడుదల చేస్తున్నామని, అప్పట్లో రూ. 7.24 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ టైమ్ ముగిసే సరికి రూ.18.04 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి ఆల్ టైమ్ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా అదే ఏడాది అత్యధిక కలెక్షన్స్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి ఏకంగా 5 నంది అవార్డులు కూడా వచ్చాయి. నువ్వు నాకు నచ్చావ్ సినిమా (తమిళం, కన్నడ, బెంగాలీ) వంటి భాషలలో కూడా రీమేక్ అయ్యింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఇప్పటికీ యూట్యూబ్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.