ప్రతిష్టాత్మక ఎన్నిక... ఊహించని పరిణామాలు...!

Podili Ravindranath
మొట్టమొదటిసారిగా జరిగిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక పక్క టీడీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాతో ఉండగా మరోపక్క వైసీపీకి కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.  సాధారణంగా ఎక్సోఫిషియ ఓటు ఎంపీ పరిధిలో ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఏదైనా ఒక్క చోట అది ఆయన ఎంపిక చేసుకున్న చోట. ఇక్కడే అనేక సందేహాలు మొదటి నుండి ఉన్నాయి. గతంలో ఎంపీ కేశినేని నాని తన ఎక్సోఫిషియ ఓటు విజయవాడలో నమోదు చేసుకోగా అక్కడ వినియోగించ లేదు అనేది స్పష్టం అవుతుంది. అయితే కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో తన ఓటు నమోదు చేసుకోవాలని కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు స్వయంగా కింది స్థాయి వారిని పంపించారు. అయితే ఆయన కానీ.. ఆయన సిబ్బంది కానీ ఆ సమయంలో స్పందించలేదు అని చెబుతున్నారు. ఇక్కడే అసలు చిక్కులు వచ్చి పడ్డాయి. ఓటు నమోదు చేసుకోకుండా ఓటు వినియోగించే అవకాశం ఉందా..?? ఎంపీ వేసిన ఓటు చెల్లుతుందా...?? కోర్టు తీర్పు వాయిదా ఎందుకు పడింది.. ఇలా అనేక సందేహాలు ప్రజలు చర్చనీయాంశం గా మారాయి.
ఆది నుండి ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు చెల్లదు అని వైసీపీ వాదిస్తూవస్తోంది. అయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు  పాలకవర్గ ఎన్నిక జరిగింది. కానీ ఫలితాలు మాత్రం కోర్టు పరిధిలోకి వెళ్ళాయి. అయితే మరుసటి రోజు తీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కోర్టు తీర్పు వాయిదా వేయడంతో హైకోర్టు తీర్పు పై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుంది... ఎంపి ఓటు చెల్లుతుందా లేదా, ఒకవేళ చెల్లకపోతే జరిగే పరిణామాలు ఏమిటి...??  అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. తొలిసారి జరుగుతున్న కొండపల్లి మునిసిపాలిటీపై తమ పార్టీ జెండా ఎగురవేయాలని అధికార వైసీపీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉందని... కాబట్టి కోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: