షర్మిలమ్మ.. మరో ఐలమ్మ: తెలంగాణ కోసం తగ్గేదేలే..!
టీఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా పెట్టాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయని కేసీఆర్ చెప్పడంతో తాజాగా వివాదం మొదలైంది. ఏపీలో కొత్తగా పార్టీ ఎందుకు.. అసలు రెండు రాష్ట్రాలు కలిపేస్తే పోలా అంటూ మంత్రి పేర్నినాని సెటైర్ వేశారు.. దీంతో మళ్లీ సమైక్య రాష్ట్రంపై వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఏపీ నేతల వ్యాఖ్యలకు ఆజ్యం పోసేలా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడారు. తాను మొదటి నుంచి సమైక్య వాదినేనని ఏపీ, తెలంగాణ కలిపేయాలనుకుంటే తాను స్వాగతిస్తానంటూ మాట్లాడారు. దీంతో మరోసారి సమైక్య రాష్ట్రం ఉంటే ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది.
ఇప్పుడు ఈ సమైక్య రాష్ట్రం చర్చలోకి తెలంగాణ కొత్త నేత వైఎస్ షర్మిల ఎంటరైంది.. ఇప్పటికీ ఆంధ్రా నేతగా ముద్ర ఉన్న షర్మిల.. ఇప్పుడు ఈ అంశం ద్వారా తెలంగాణవాదిగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ, తెలంగాణ కలిపేది లేదంటూ ఆమె స్పష్టం చేశారు. వందల మంది అమర వీరుల త్యాగఫలంగా వచ్చిన తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతామని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ కోసం మళ్లీ ఏ పోరాటానికైనా సిద్ధమంటూ సమరశంఖం పూరించింది షర్మిల.
అయితే.. ఇవన్నీ ఎవరి పొలిటికల్ మైలేజీ కోసం వారు ఆడుతున్న డ్రామాలుగానే కనిపిస్తున్నాయి తప్ప.. ఏపీ, తెలంగాణ మళ్లీ ఒక్కటయ్యేదీ లేదు.. అది జరిగేదీ కాదంటున్నారు విశ్లేషకులు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండకుండా ఈ పంచాయతీలెందుకని హితవు చెబుతున్నారు.