ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేసీఆర్..?
కానీ.. కేసీఆర్ ఎత్తుగడలు చూస్తుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉందంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. జగన్ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నారని రేవంత్‌రెడ్డి అంటున్నారు. కేసీఆర్ జగన్ మొదటి నుంచి కవలలుగా కలిసి వెళ్తున్నారన్న రేవంత్ రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు.. వైఎస్ షర్మిల పాదయాత్ర, పేర్ని నాని వ్యాఖ్యలు ఈ కుట్రను సూచిస్తున్నాయని రేవంత్ రెడ్డి అంటున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పెంచి ఏపీ, తెలంగాణ కలిపే కుట్ర సాగుతోందన్న రేవంత్ రెడ్డి... పేర్ని నాని వ్యాఖ్యలను తెరాస ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ పేర్ని నాని ఏమన్నారంటే.. అసలు రెండు రాష్ట్రాలు ఎందుకు.. ఉమ్మడి రాష్ట్రం చేసుకుని కేసీఆర్ పరిపాలించుకోవచ్చు కదా.. అన్నట్టున్నారు. అసలు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందంటే.. మొన్న కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ.. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టమని తమకు విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు.
కేసీఆర్ సంగతి పక్కకు పెడితే.. కేసీఆర్‌లా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఓ నాయకుడు.. ఆ తర్వాత ఉమ్మడి ఏపీకి సీఎం కూడా అయ్యారు.. ఆయనే మర్రి చెన్నారెడ్డి.. తెలంగాణ ప్రజా సమితి పార్టీ ఏర్పాటు చేసి.. ఏకంగా 11 ఎంపీ సీట్లు గెలుచుకున్న మర్రి చెన్నారెడ్డి.. ఆ తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒత్తిడితో తెలంగాణ ఉద్యమం వదిలేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీకి సీఎంగా పని చేశారు. మరి కేసీఆర్ కూడా ఉమ్మడి ఏపీకి సీఎం అవుతారా.. అంటే.. అదేదో రాజకీయ విమర్శలకు పనికొస్తుంది కానీ.. అది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.