రెడ్ల అల్లుడు ఈటెల రాజేందర్, యాదవుల బిడ్డ గెల్లు శ్రీనివాస్.. ఇద్దరే పోటీలో మరొకరు ఉన్నా అది పోటీలో ఉన్నా లేకున్నా ఒక్కటే అన్న విధంగా ఉంది. కనుక ఆయన గురించి రాయడం పెద్దగా ఈ చర్చకు ఉపయోగపడే విషయం కాదు. రేవంత్ కూడా కేవలం ఓ నామమాత్రపు అభ్యర్థిని తెరపైకి తెచ్చాడు అన్న నిందను కూడా మోస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇద్దరి బీసీ నేతల మధ్య ఓట్ల పోరు ఎలా ఉండనుంది అన్నదే ఆసక్తిదాయకంగా మారిపోయింది. ప్రజలు అప్పటి కన్నా ఇప్పుడు బాగా తెలివిమీరిపోయార ని, ఓటింగ్ వేళ వీరి తెలివిని అంచనావేయడమే కష్టంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్న మాట. అవును! సుదీర్ఘ కాలం పాటు రాజకీయ విశ్లేషణలు సాగిస్తున్న వారందిరికీ కూడా ఇటీవల పరిణామాలేవీ అంతు చిక్కకుండానే ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇవాళ్టి రాజకీయాలకు కులం ఒక్కటే ప్రాధాన్యం కాకపోయినా మిగతా పనులపై దాని ప్రభావం మాత్రం సుస్పష్టంగా ఉంటుంది. కుల రాజకీయాలు ప్రబలంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్ కు ఉన్న ఛార్మింగ్ చాలా ఎక్కువ. రెడ్డి సామాజికవర్గ నేతగా పేరున్న జగన్ కు కూడా ఇంతటి పేరు లేదు. ఓ బీసీ నాయకుడిగా కేసీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఆయన కుటుంబ మూలాలకు సంబంధించి ఇప్పటికీ తెలంగాణలో ఏదో ఒక చోట చర్చ నడుస్తూనే ఉంటుంది.
ఇది ఎలా ఉన్నా కేసీఆర్ తన సామాజిక వర్గం సమీప సామాజికవర్గ నేతలు ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా ఎక్కువగానే ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ఉత్తరాంధ్ర బీసీ నేత ఎర్రన్నాయుడి కొడుకు రామ్మోహన్ నాయుడ్ని ఢిల్లీ కేంద్రంగా ప్రోత్సహిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని కులాలకు సంబంధించి రాజకీయ సమీకరణాలు నెరపడంలో కూడా కేసీఆర్ దిట్టే! కానీ ఇవన్నీ ఇప్పుడు మారిపోయాయి. ఆయనను సొంత సమాజం నమ్మడం మానుకుంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఆయన గెలుస్తాడా ఓడిపోతాడా అన్నది కూడా ముఖ్యం కాదు కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో మాత్రం కేసీఆర్ పూర్తిగా వెనుకబడిపోతున్నాడు. కొన్నిసార్లు గుడ్డి నమ్మకాల కారణంగా చతికిలపడుతున్నాడు. కొన్ని సార్లు సొంత మనుషులను వేరే పార్టీలకు పంపి కూడా నష్టపోతున్నాడు.
ఓ విధంగా చూసుకుంటే కోవర్టు ఆపరేషన్ కూడా సరిగా చేయలేకపోతున్నాడు. అదే సమయంలో జగన్ దూరదృష్టితో ఓ అడుగు ముందుకు వేశాడు. అగ్ర వర్ణాల కోసం ఓ సంక్షేమ శాఖను ప్రారంభించేందుకు ఇవాళ ఏపీ క్యాబినెట్ నుంచి ఆమోదం తీసుకుని, త్వరలోనే ఆ నిర్ణయాన్ని అమలు చేయనున్నాడు. ఓ విధంగా ఈ చర్య ఎంత మేరకు ఫలిస్తుందో లేదో కానీ గొప్ప నిర్ణయం అవుతుందో లేదో కానీ మంచి నిర్ణయం మాత్రం కావడం తథ్యం.