ప్రపంచంపై పెద్ద బాంబు.. రెండు డిగ్రీలు పెరిగితే ఔట్‌ ?

Chakravarthi Kalyan
కోట్ల ఏళ్ల నుంచి పచ్చగా పరిఢవిల్లింది ప్రకృతి.. అనంత విశ్వంలోనే ప్రత్యేకంగా నిలచింది నీలి భూమి.. మూడొంతులు జలం.. ఒక వంతు నేల ఉన్న భూమాత.. అనంత విశ్వంలోనే జీవం నింపుకున్న ఏకైక గ్రహం.. వందల కోట్ల ఏళ్ల నుంచి ఆ పచ్చదనం అలాగే ఉంది. కొన్ని కోట్ల కోట్ల జీవరాశులు ఈ భూమండలంపై సందడి చేశాయి.. అయితే అందులో ఉన్న ఒకే ఒక్క జంతువు.. ఈ భూమాత నాశనానికి కారణంగా కాబోతోంది. ఆ బుద్దిలేని జంతువే మనిషి.

అవును.. ఇది నిజం.. మనిషి తాను పెద్ద తెలివిమంతుడినని చెప్పుకునే మనిషి తన అతి తెలివితో కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు. ఇందుకు తాజాగా ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించిన గణాంకాలే తార్కాణం.. అవును.. ఈ భూమి ఉష్ణోగ్రత మరో రెండు డిగ్రీలు పెరిగితే.. భూమి వినాశనానికి దారి తీస్తుందట. ఐక్యరాజ్య సమితి 195 దేశాల ప్రభుత్వాల సహకారంతో వందల మంది శాస్త్రవేత్తలు పరిశోధనలతో రూపొందించిన వాతావరణ మార్పు 2021  నివేదిక చెబుతున్న వాస్తవం ఇది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపులో ఉండాలంటే.. దేశాధినేతలు నడుం బిగించాల్సిందేనంటోంది ఈ నివేదక. ఈ శతాబ్దం చివరకు భూతాపం 2 డిగ్రీలు పెరిగితే మానవాళి పెనుముప్పులో పడుతుందని హెచ్చరించింది.

ఐక్యరాజ్య సమితి తొలి నివేదిక ప్రకారం భూతాపం వేగంగా పెరుగుతోందట. 2018లో 2040 నాటికి భూ తాపం 1.5 డిగ్రీల మేర పెరగనుందని అంచనా వేశారు. కానీ.. ఇప్పటి లెక్కల ప్రకారం అది 2030కే జరుగుతుందట. సముద్రమట్టం కూడా వేగంగా పెరిగిపోతోందట. 2006- 2018 మధ్యలో సముద్ర మట్టం ఏడాదికి 3.7 మిల్లీ మీటర్ల మేర పెరిగింది. చూడటానికి ఇంతే కదా అనిపిస్తోంది కదా. కానీ.. 1901 నుంచి 71 వరకు పెరిగిన దానితో పోల్చితే ఇది రెట్టింపు. 1901 నుంచి 2018 మధ్య 0.20 మీటర్ల మేర సముద్ర మట్టం పెరిగింది.

ఇందుకు మనిషి చేజేతులా చేస్తున్న అరాచకమే కారణమని నివేదిక చెబుతోంది. మానవచర్యలతోనే వాతావరణ మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా నగరాలు ఈ గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయట. ఈ భూతాపం 2 డిగ్రీల మేర పెరిగితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపు తప్పుతుందని ఐరాస వార్నింగ్ ఇచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: