ఆ నంబర్ గూగుల్‌లో వెదికితే.. మీ ఖాతాలో సొమ్ము మాయం..?

Chakravarthi Kalyan
రెండు రెళ్లు ఎంత అంటే కూడా గూగుల్‌లో వెదికే కాలం ఇది. ఇప్పుడు అంతా గూగుల్ మయం.. ఏం కావాలన్నా.. ఏం తెలుసుకోవాలన్నా అంతా గూగులమ్మే దిక్కు. చిన్నా, పెద్దా అంతా ఇదే తీరు.. ఫోన్ ఖరాబైంది.. కంపెనీ వాడికి కాల్ చేయాలి.. కస్టమర్ కేర్ కోసం గూగులమ్మను అడగాలి.. ఫ్రిజ్ పాడైంది.. రిపేర్ వాడిని పిలవాలి.. చలో గూగులమ్మను అడిగేద్దాం.. ఇలా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ గూగులమ్మ ఆసరాగా మారింది. ఇప్పుడు ఇదే అంశం సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది.

ఓ వ్యాపారం పెట్టాలి.. డిటైల్స్ కోసం గూగుల్‌లో వెదుకుతాం.. ఓ మెషీన్ కావాలి.. వివరాలు కోసం గూగుల్‌లో వెదుకుతాం.. మనం ఇలా ప్రతి విషయానికీ గూగుల్‌లో వెదుకుతామన్న సంగతి పసిగట్టిన సైబర్ నేరగాళ్లు అక్కడే తమ ఉపాధి అవకాశాలు వెదుక్కుంటున్నారు. జనం బాగా వెదికే కస్టమర్ కేర్ సెంటర్లను గుర్తించి.. ఆ స్థానంలో తమ నెంబర్లు పెడుతున్నారు. ఇక జనం ఏదైనా సమస్య కోసం గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేసి.. ఆ దొరికిన నెంబర్‌కు ఫోన్ చేస్తే.. ఇక అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు తమ సత్తా ఏంటో చూపిస్తారు. అచ్చమైన కస్టమర్ కేర్ ఉద్యోగుల్లా నాటకమాడతారు.

కస్టమర్ల డేటా అంతా సేకరిస్తారు.. అకౌంట్ నెంబర్‌, పిన్  నెంబర్‌, ఇలా రకరకాలుగా సమాచారం సేకరిస్తారు.. అడిగిన వాళ్ల రేంజ్‌ను బట్టి ఈ నకిలీ కస్టమర్ కేర్ సెంటర్ల ఉద్యోగులు ప్రవర్తిస్తారు. మొత్తానికి ఆ సమాచారం ఆధారంగా అప్పటికప్పుడు కథలు అల్లేస్తారు.. ముందు ఇంత పే చేయండి.. ఆ తర్వాత మీ పనవుతుందంటారు. కొందరు నమ్మి డబ్బు పే చేయగానే.. మరో సమస్య చెబుతారు.. ఇలా క్రమంగా డబ్బు గుంజడం ప్రారంభిస్తారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి సైబర్ నేరాలు బాగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి కేసుల వివరాలు బయటపెడుతున్న పోలీసులు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు ఎవరి వద్దా తమ అకౌంట్ నెంబర్లు, పిన్ నెంబర్లు పంచుకోవడం చేయవద్దని.. అపరిచితులను నమ్మి అకౌంట్లలో డబ్బు వేయవద్దని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: